విజయసాయిని వదిలేసి నాపై కేసు పెడతారా?

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. దేశమంతటా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) అమల్లో ఉందని, కానీ, ఏపీలో అది అమలవుతోందో లేదో అనుమానంగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో జగన్‌ పీనల్‌ కోడ్‌ అమలు చేస్తున్నారా? రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉందా అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు, ప్రజల నోరు మూయించడానికి పోలీసు శాఖ లేదని, తిరగబడితే పోలీసులు తోక జాడించాల్సిందేనని హెచ్చరించారు. కళా వెంకట్రావు అరెస్టు ఘటనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. హత్యలు, అత్యాచారాలు చేసిన నేరగాడిలా కళా వెంకట్రావును అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థంలో తన కాన్వాయ్‌కు అడుగడుగునా అడ్డుపడ్డారని, విజయసాయి కారుపై ఎవరో రాయి విసిరితే తనపై, అచ్చెన్నాయుడిపై, కళాపై కేసు పెట్టడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు.


విగ్రహాలు ధ్వంసం చేశానని స్వయంగా చెప్పిన పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తికి రాచమర్యాదలు చేస్తున్నారని, అసలు ఆయన డీజీపీ ఇంట్లో ఉన్నాడో.. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడో ఎవరికీ తెలియదని దుయ్యబట్టారు. క్రైస్తవ గ్రామాలను ఏర్పాటు చేస్తున్నానని చెప్పిన ప్రవీణ్ కు కడపలో బ్యాంకు ఖాతా ఎందుకు ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతి ఇచ్చి రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దేవినేని ఉమను స్టేషన్‌ వెంట స్టేషన్‌కు అనేకచోట్లకు తిప్పారని, కళా వెంకట్రావు అరెస్టుపై తిరుగుబాటు రావడంతో వదిలిపెట్టక తప్పలేదని అన్నాు. ప్రతిచోటా ప్రతిఘటిస్తామని,  తనను, ప్రజలను కూడా జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు శాఖ అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మ మాదిరిగా మారిందని, దీనిపై డీజీపీ సవాంగ్ సమాధానం చెప్పాలని నిలదీశారు.


దేవినేని ఉమను ఇంటికొచ్చి కొడతానని ఒక రౌడీ మంత్రి అన్నాడని, ఆ మంత్రిపై ఎందుకు కేసు పెట్టరని ప్రశ్నించారు. తాడిపత్రిలో టీడీపీ నాయకుడి ఇంట్లోకి పోలీసుల సమక్షంలోనే స్థానిక ఎమ్మెల్యే జనాన్ని వేసుకుని వెళ్తాడా? అని ప్రశ్నించారు. మత సామరస్యాన్ని దెబ్బ తీస్తోంది.. మత విద్వేషాలు పెంచుతోంది వైసీపీ నేతలేనని, అధికార పార్టీ ఎమ్మెల్యేను నిలదీసిన జనసేన కార్యకర్త 2 రోజుల్లో శవంగా మారడం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. మద్యం రేట్లపై ప్రశ్నించిన వైసీపీ కార్యకర్త ఓం ప్రకాశ్‌ది హత్యో ఆత్మహత్యో తెలియదని, దీనికి ప్రభుత్వానిదే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గుడివాడలో మంత్రి పేకాట శిబిరాలపై దాడి చేసిన ఎస్సై విజయ్‌కుమార్‌ 2 రోజుల్లో శవంగా మారాడని, అది కూడా హత్యో ఆత్మహత్యో తెలియదని, వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని అన్నారు.

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మంచివాడేనని,  గతంలో ఇలా లేరని,  కానీ పదవి కోసం లొంగిపోయారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అనుమానాస్పద మరణాలపై డీజీపీ ఆలోచన చేసుకోవాలని హితవు పలికారు. ఇన్నేళ్ల సర్వీసులో సవాంగ్ ఏమి నేర్చుకున్నారని, ఆయన నిర్వీర్యమై పోయి  కింద వారిని కూడా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఖాకీ బట్టల గౌరవం కాపాడలేకపోతే నమస్కారం పెట్టి వెళ్లిపోవాలని హితవు పలికారు. ఏ-1, ఏ-2, సజ్జల ఏది చెబితే అది చేయడానికేనా పోలీసు శాఖ ఉంది? అని ప్రశ్నించారు. ఉద్యోగులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తే వారి గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతి రైతులతో జగన్ ఎందుకు చర్చలు జరపరని ప్రశ్నించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని పేరుపెట్టి కేసులు పెడతారా? అది ఏ చట్టంలో ఉంది? ఏ సెక్షన్ల కింద అది నేరం? అని చంద్రబాబు ప్రశ్నించారు.

క్రైస్తవ మతాన్ని రోడ్డున పడేసింది జగన్ అని, ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ ముగ్గురూ క్రైస్తవులు కావడంపై తమకు అభ్యంతరం లేదని చెప్పారు. ఇతర మతాల వారి ఆలయాలపై దాడులపై వారు  బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జగన్ బలవంతపు మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నాడని, ఇంకా ఎంత మంది ప్రవీణ్‌లు ఉన్నారో బయటకు రావాలని అన్నారు. తెలుగుదేశం లౌకిక పార్టీ అని, అన్ని మతాలు తమకు సమానం అని అన్నారు. 16 నెలలు జైల్లో ఉండివచ్చిన ఒక కరుడుగట్టిన అవినీతిపరుడు తన పర్యటనకు అడ్డుపడినా ఏమీ అనరని, కానీ, అనుమతి తీసుకుని వెళ్లిన తననపైనా, కళావెంకట్రావు, అచ్చెన్నాయుడిపై కేసులు పెడతారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి జాతీయస్థాయిలో సంచలనం అయ్యేసరికి నాలుగు రోజులు హడావిడి చేసి ఆపై వదిలేశారని ఆరోపించారు. ఆ వింత వ్యాధి ఇప్పుడు దెందులూరుకు పాకిందని, పాలకులు కుట్ర రాజకీయాలు, వ్యవస్థలను నాశనం చేసేవాటి మీద పెట్టే శ్రద్ధ ప్రజారోగ్యంపై పెట్టాలని హితవు పలికారు. వైసీపీ పాలనలో తాము ప్రాణాలతో ఉంటే చాలనే పరిస్థితికి ప్రజలు వచ్చారని వ్యాఖ్యానించారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.