కళా వెంకట్రావు అరెస్టు- ఉత్తరాంధ్రలో ఉద్రిక్తత... లోకేష్ వార్నింగ్.. విడుదల
విజయనగరం జిల్లా రామతీర్థంలో ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేకపోయిన ఏపీ పోలీసులు ... అక్కడి తదనంతర ఘటనల కేసులో టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావును నిన్న అర్ధరాత్రి అరెస్టు చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై జరిగిన దాడి కేసులో కళాను అరెస్ట్ చేసినట్లు పోలీసులువెల్లడించారు.
దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మండిపడింది. పాలన చేతకాదు, విధ్వంసం మాత్రం విచ్చలవిడిగా చేస్తూ రాముడి విగ్రహ తలను వేరు చేసిన నిందితులను పట్టుకోవడం చేతకాక మా నేతను అరెస్టు చేస్తారా అంటూ నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
ఇక పోలీసులు కళా వెంకట్రావును అరెస్టు చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో టీడీపీ శ్రేణులు పెద్దఎత్తును తరలివచ్చాయి. ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తంగా మారింది. మా నేతను ఎలా అరెస్టు చేస్తారంటూ ఆందోళన చేపట్టారు. ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల్లా రాత్రిపూట అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అన్నారు. కళాను వెంటనే విడుదల చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
రామతీర్థంలో రాముడి విగ్రహం తల ఎత్తుకెళ్లిన వారిని పట్టుకోలేకపోయిన చేతకాని సర్కారు, అత్యంత సౌమ్యుడైన బీసీ నేత..టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/2) pic.twitter.com/qNv28PVWJz
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 20, 2021
తిరుపతి ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ ప్రభుత్వం పనికిమాలిన పనులు చేస్తుందన్నారు. కళా అరెస్ట్‌కు వైసీపీ మూల్యం చెల్లించుకోకతప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
మరి ఏమైందో ఏమో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఉదయాన్నే కళాను పోలీసులు వదిలపెట్టారు. విజయసాయిరెడ్డి మీద చెప్పుల దాడి కేసులో ఆయనను అరెస్టు చేశామని చెప్పిన పోలీసులు మరి ఉదయంలోపు ఎందుకు వదిలిపెట్టారు, పొరపాటుగా అరెస్టు చేయడం వల్లనా, లేకపోతే రాజకీయంగా ఇది అనేక సంఘటనలకు దారితీస్తుందనా అన్నది తెలియడం లేదు.
కళా వెంకట్రావు గారిని వెంటనే విడుదల చెయ్యాలని తెదేపా కార్యకర్తల నిరసన. pic.twitter.com/w25NacjNjg
— iTDP Official (@iTDP_Official) January 20, 2021
తన అరెస్టుపై కళా వెంకట్రావు స్పందించారు. ఎన్ని కేసులు పెట్టినా దేవుడి కోసం టీడీపీ పోరాటం ఆగదు. తాము ప్రజలతోనే ఉంటాం. వారి కోసం పోరాడుతూనే ఉంటాం. దేవాలయాలపై దాడులను ఖండిస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ నిలదీశారు.
దేవుడికి అపచారం చేసిన నిందితులను పట్టుకోవడం చేతగాక, దానిని కప్పిపుచ్చుకోవడానికి నన్ను అరెస్ట్ చేస్తారా? అంటూ ఆయన పోలీసులను ప్రశ్నించారు.