కేసీఆర్‌కు పెను సవాల్‌!

‘వారసుడి’కి ప్రమాద ఘంటికలు!!
‘కేంద్ర’ రాజకీయ యత్నాలకు గండి
కొత్త ఏడాదిలో మరిన్ని పరీక్షలు
మండలి, పురపాలక ఎన్నికలు
కీలకంగా మారిన సాగర్‌ ఉప ఎన్నిక
దుబ్బాక ఉప ఎన్నిక నుంచి
బీజేపీపై అకారణ ద్వేషం
మోదీ, షాపైనా విమర్శలు
ఊహించని పరాజయంతో దిద్దుబాటు చర్యలు
ఆకస్మికంగా హస్తిన పయనం
ప్రధాని, అమిత్ షాతో భేటీ.. రాజీ కోసమేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీవితంలో తొలిసారి కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌లో కుమ్ములాటలను ఉపయోగించుకుని.. ఫిరాయింపులను ప్రోత్సహించి బలపడిన ఆయన.. ఇక టీఆర్‌ఎస్‌కు ఢోకా లేదని.. సీఎం సింహాసనాన్ని తన కుమారుడు కేటీఆర్‌కు అప్పగించి.. కేంద్ర రాజకీయాలకు వెళ్లాలని భావించారు. కానీ దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో అనూహ్య పరాజయాలతో ఆయన ఆశలు ఆవిరయ్యాయి. బీజేపీ బ్రహ్మాండంగా పుంజుకోవడం, కాంగ్రెస్‌ పరిస్థితి క్రమంగా ఆంధ్రప్రదేశ్‌లో మాదిరి తయారవుతుండడంతో.. ఆయన స్పీడుకు బ్రేకులు పడ్డాయి. దుబ్బాకలో పార్టీని మేనల్లుడు హరీశ్‌రావు గెలిపించలేకపోయారు. గ్రేటర్‌లో కుమారుడు కేటీఆర్‌కూ అదే పరిస్థితి ఎదురైంది. ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై కేసీఆర్‌, కేటీఆర్‌ అనుచిత విమర్శలకు దిగారు. వరదలకు హైదరాబాద్‌ అతలాకుతలమైతే.. వరద సాయాన్ని తన పార్టీ వారే దిగమింగినా పట్టించుకోకుండా.. ఆపన్నులను ఆదుకోవడం మాని.. కేంద్రం నిధులివ్వలేదని ఆరోపించడం.. 17 మంది ఎంపీలున్న రాష్ట్రం నుంచి వెళ్లి కేంద్రంలో చక్రం తిప్పుతానని బీరాలు పలకడం వంటివాటిని ప్రజలు అంగీకరించలేదు. వట్టి మాటలకు, ప్రత్యర్థులపై నిష్కారణ నిందలతో పని జరగదని.. అలాంటి రాజకీయాలకు తెలంగాణలో కాలం చెల్లిందని వారు తమ ఓటుతో నిరూపించారు. మాటల మాంత్రికుడు కూడా ఇది గ్రహించినట్లు కనబడుతోంది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను గ్రేటర్‌ ఎన్నికల్లో విమర్శిస్తే లాభం జరగకపోగా.. ఓటమిని ఖాయం చేసిందని.. తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీ.. ఇక్కడ అధికారం కైవసం చేసుకోవడానికి కాచుక్కూర్చుందని ఆయనకు అర్థమైనట్లు ఉంది. కొత్త సంవత్సరంలో మరిన్ని ఎన్నికలు ఎదుర్కోవలసి ఉంది. ఇవి బీజేపీకి రాచబాటపరిస్తే తన వారసుడిని సింహాసనంపై కూర్చోబెట్టాలన్న తన కల చెదిరిపోతుందన్న ఆందోళన ఆయనలో కనబడుతోంది. అందుకే నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. బీజేపీతో మళ్లీ సయోధ్యకు పూనుకున్నారు. ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాను, ప్రధాని మోదీని కలిశారు. వరద సాయం, ప్రాజెక్టులపై మాట్లాడారని అందరూ అంటున్నా.. అసలు సంగతి రాజకీయమే. ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడతామని.. మిగతా సమయాల్లో అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలని వారితో అన్నట్లు తెలిసింది. బీజేపీపై దురాగ్రహంతో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడడమే గాక.. భారత బంద్‌లో కేసీఆర్‌ ప్రభుత్వం పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీతో సమరమేనని కేసీఆర్‌ కాలుదువ్వారు. దీనిపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ విషయంలో మోదీ ఆగ్రహంతో ఉన్నారని సమాచారం రాగానే.. కేసీఆర్‌ రూట్‌ మార్చారు. కొత్త పార్లమెంటు భవనం శంకుస్థాపన సందర్భంగా ప్రధానికి అభిందనలు తెలిపారు. హడావుడిగా ఢిల్లీ వెళ్లి.. ఆయన్ను, అమిత్ షాను కలిసి చర్చలు జరిపారు. ఇవన్నీ రాజీ కోసమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ అవే చట్టాలను అదేనోటితో సమర్థించినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానిస్తున్నాయి.
దెబ్బతీసింది ఇవే..
ఏడేళ్లుగా అప్రతిహతంగా సీఎంగా కొనసాగుతున్న కేసీఆర్‌.. ఎన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నా ప్రజల మద్దతు లభించింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు నడుం బిగిస్తే వారు సంతోషించారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పుణ్యమా అని ఆంధ్రలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దెబ్బతినడంతో హైదరాబాద్‌లో పుంజుకుంది. కానీ రెవెన్యూ ప్రక్షాళన పేరిట లోపభూయిష్టమైన ధరణి పోర్టల్‌ తెచ్చి.. హైకోర్టు చెప్పిందన్న వంకతో రిజిసే్ట్రషన్లు ఆపేసి.. స్థిరాస్తి వ్యాపారులను తీవ్రంగా నష్టపరిచారు. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో అయినా పరిస్థితిని చక్కదిద్దలేదు సరికదా.. వ్యవహారం కోర్టులో ఉందన్న సాకు చెప్పి తప్పించుకోవాలనుకున్నారు. అందుకు ప్రతిఫలంగా ఓటమిని అందుకున్నారు. దుబ్బాకలో మరణించిన ఎమ్మెల్యే రామలింగారెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండేది. సానుభూతితో గెలవొచ్చన్న ఉద్దేశంతో ఆయన కుమారుడికి టికెట్‌ ఇద్దామని కేసీఆర్‌ తొలుత అనుకున్నారు. కానీ ఆ అబ్బాయి వల్లే రామలింగారెడ్డికి చెడ్డపేరు వచ్చిందని టీఆర్‌ఎస్‌ స్థానిక నేతలు చెప్పడంతో భార్య సుజాతకు ఇచ్చారు. నిజానికి ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిని చేస్తే గెలిచి ఉండేవారు. కానీ ఆయనకు ఆశచూపి టికెట్‌ నిరాకరించారు. దాంతో ఆయన కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ తెచ్చుకుని బరిలో నిలిచారు. తాను గెలవలేకపోయినా.. టీఆర్‌ఎస్‌ను కీలక ప్రాంతాల్లో దెబ్బతీయగలిగారు. కేసీఆర్‌ అంచనా తొలిసారి ఘోరంగా దెబ్బతింది. గ్రేటర్‌లో పార్టీ కార్పొరేటర్లు కొందరు ఐదేళ్లుగా ప్రజల ముఖమైనా చూడలేదు. వారి సమస్యలు పరిష్కరించకపోగా.. కబ్జాలు, వేధింపులతో సతాయించారు. చివరకు ఎన్నికల ముంగిట వరద సాయాన్ని స్వాహా చేసినా.. వారిని మార్చలేదు. వేరే చోట్ల అభ్యర్థులను మార్చారు. ఈ రెండు చోట్లా టీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. రెండోసారి కూడా ఆయన వ్యూహం ఫలించలేదు. అంటే ప్రజల్లో తనపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఆయనకు తెలిసిపోయింది. సింహాసనం తన వారసుడికి దక్కాలంటే రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త ఏడాదిలో ఆయనకు అన్నీ అగ్నిపరీక్షలే. శాసనమండలి ఎన్నికలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలు ఉన్నాయి. నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. వీటిలో విజయం సాధించడం కేసీఆర్‌కు తప్పనిసరి. మరో మూడేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. తన బలాన్ని నిరూపించుకోవడానికి స్థానిక, ఉప ఎన్నికలే కీలకం. ఇక్కడ దెబ్బతింటే ప్రమాద ఘంటికలే!
ఆర్థిక ఇక్కట్లలో..
దేశాన్ని తెలంగాణ రాష్ట్రమే ఆదుకుంటోందని.. అధికాదాయం సమకూర్చిపెడుతోందని కేసీఆర్‌, కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. రాష్ట్రానికి నిధులివ్వకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుటోందని ఆరోపణలు గుప్పించారు. దీంతో ఈ ఏడేళ్లలో కేంద్రం ఎంతిచ్చిందో బీజేపీ నేతలు లెక్కలు విప్పారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో ఉంది. దీనివల్లే రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి చెల్లించలేక కేసీఆర్‌ దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారైంది. మిగులు ఆదాయం ఉన్న రాష్ట్రం అయినప్పటికీ, నెలనెలా అప్పులు చేయాల్సి వస్తోంది. ఎక్కడ దొరికితే అక్కద దూసితెస్తున్నారు. కేంద్రం ఆదుకోకపోతే ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లోనే.. ఎన్నికల సందర్భంగా బీజేపీ అగ్రనేతలపై దారుణమైన విమర్శలు చేసిన కేసీఆర్‌ దిద్దుబాటు చర్యలకు దిగారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.