నారా బ్రాహ్మణి...ఎ సక్సెస్ ఫుల్ ఎంటర్ ప్రెన్యుర్

రాజకీయ, సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి రాజకీయ, సినీ వారసులు రావడం సహజం. తమకు వచ్చిన వారసత్వాన్ని ఉపయోగించుకొని రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వారూ ఉన్నారు. తమ కుటుంబానికున్న సినీ నేపథ్యాన్ని వాడుకొని సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సినీ తారలూ ఉన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఇటు రాజకీయ పరంగా అటు సినీ రంగం పరంగా చరిత్రాత్మక నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన ఓ మహిళ మాత్రం...తన తండ్రి, తాత, మామయ్యల ఇమేజ్ ను ఏ మాత్రం ఉపయోగించుకుకోకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె... నారా బ్రాహ్మణి. నందమూరి బాలకృష్ణ కూతురు.
nara brahmani with son
nara brahmani with son
వ్యాపారంలో తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు...తమ సంస్థను అగ్రగామిగా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకోవడం ఇష్టం లేదన్న చందంగా....తన నేపథ్యం చెప్పుకొని అందలాన్ని అందుకోవాలని బ్రాహ్మణి ఏనాడూ ఆశించలేదు. తన తెలివితటలు, స్వయంకృషి, ప్రణాళికలతో అనతికాలంలో విజయవంతమైన వ్యాపార వేత్తగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఆ మహిళ ఎందరో యువతులు, మహిళలకు ఆదర్శం. తనకు అప్పగించిన వ్యాపార రంగంలో జెట్ స్పీడుతో దూసుకుపోతున్న ఆ యువ పారిశ్రామిక  ప్రస్తుతం.... హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి. ఈ రోజు నారా బ్రాహ్మణి పుట్టిన రోజు సందర్భంగా నమస్తే ఆంధ్ర పాఠకుల కోసం ప్రత్యేక కథనం.

విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవరాలిగా, నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తనయురాలిగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోడలిగా, టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ భార్యగా....ఇలా నారా బ్రాహ్మణికి గట్టి బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆమె తలచుకుంటే ఇటు రాజకీయాల్లో....అటు సినీ రంగంలో....రాణించగల సత్తా ఉంది. కానీ, అలా చేస్తే ఆమె నారా బ్రాహ్మణి అయ్యుండేవారు కాదు. తన తాతయ్య, తండ్రి, మామయ్య, భర్తల నుంచి వచ్చిన రాజకీయ, నట వారసత్వానికి బ్రాహ్మణి దూరంగా ఉన్నారు.
తన మెట్టినింటికి చెందిన హెరిటేజ్ సంస్థలో తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ సక్సెస్ ఫుల్ ఎంటప్రున్యూర్ గా దూసుకుపోతున్నారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ హోదాలో హెరిటేజ్‌ గ్రూప్‌ను నారాబ్రాహ్మణి మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తున్నారు. ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన లోకేశ్, బ్రాహ్మణిలు...ఎందరో యువ పారిశ్రమికవేత్తలకు మార్గదర్శులయ్యారు. 2017లో ఫిక్కీలేడీస్‌ ఆర్గనైజేషన్‌..ఈ ఇద్దరు దంపతులను ప్రత్యేకంగా సన్మానించింది. 2017కుగాను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంధనం ఆదా చేస్తున్న ఉత్తమ సంస్థగా హెరిటేజ్ ఫుడ్స్ ఎంపిక కావడం వెనుక నారా బ్రాహ్మణి కృషి ఎంతైనా ఉంది.
‘జాతీయ ఇంధన ఆదా సదస్సు - 2017’లో దేశవ్యాప్తంగా ఇంధనం ఆదా చేస్తున్న పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అవార్డులను ప్రకటించారు. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ హోదాలో బ్రాహ్మణి ఈ అవార్డును  రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. 2018లో యువ పారిశ్రామికవేత్తలతో నాటి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ భేటీకి ఏపీ నుంచి నారా బ్రాహ్మణితో పాటు పలువురు యువ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.

28 ఏళ్ల క్రితం ఎంతో ముందు చూపుతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్థాపించిన ఈ సంస్థను  కాలమాన పరిస్థితులకు, ట్రెండ్ కు తగ్గట్టుగా ముందుకు తీసుకుపోతున్నారు నారా బ్రాహ్మణి. హెరిటేజ్ సంస్థ నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్పత్తులను విడుదల చేయడంలోనూ నారా బ్రాహ్మణి ముందున్నారు.
కరోనా నేపథ్యంలో ప్రజలు వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడం కోసం అశ్వగంధ, తులసి, పసుపు, అల్లం ఫ్లేవర్లతో రోగ నిరోధకశక్తిని పెంచే పాలను మార్కెట్లోకి తీసుకువచ్చింది హెరిటేజ్ సంస్థ. రోగ నిరోధక శక్తి పెంపొందించే పాల సంబంధిత ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తయారు చేసి ప్రజలకు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్న హెరిటేజ్...ఇమ్యూనిటీ పెంచే పాల ఉత్పత్తుల తయారీలో కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.
ఆ ప్రొడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన నారా బ్రాహ్మణి ఇటు ప్రొడక్ట్ మార్కెంటింగ్ పై కూడా ఫోకస్ పెట్టారు. అంతేకాదు, ఈ టెక్ జమానాలో పాలు, పాల ఉత్పత్తుల కోసం ఓ యాప్ ను రూపొందించింది హెరిటేజ్. ఆన్ లైన్ లో హెరిటేజ్ పాలు, పాల ఉత్పత్తులు కొనేందుకు వీలుగా హెరిటేజ్ టచ్ యాప్ వంటి ఆవిష్కరణలు చేశారు నారా బ్రాహ్మణి. ఇలా తన రాజకీయ, నట వారసత్వాన్ని వాడుకోకుండా...తనకు అప్పగించిన వ్యాపార రంగంలో రాకెట్ లా దూసుకుపోతున్న నారా బ్రాహ్మణికి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.