నిధిని స్టేజ్ మీద‌ ఏడిపించేసిన ద‌ర్శ‌కుడు

ఏ సినిమా ఆడియో వేడుక లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ చూసినా.. అందులో ఆ చిత్ర క‌థానాయ‌కుడి భ‌జ‌న‌కే స‌మ‌య‌మంతా స‌రిపోతుంటుంది. యాంక‌ర్ మొద‌లుకుని.. చిత్ర యూనిట్ స‌భ్యులు, అతిథులు.. అంద‌రూ కూడా హీరోను పొగిడి పొగిడి అల‌సిపోతుంటారు. క‌రోనా-లాక్ డౌన్ కార‌ణంగా గ‌త ప‌ది నెల‌ల్లో ఇలాంటి వేడుక‌లు చూడాల్సిన అవ‌స‌రం జ‌నాల‌కు లేక‌పోయింది.

కానీ ఇప్పుడు మ‌ళ్లీ కొత్త సినిమాల సంద‌డి మొద‌ల‌వుతుండ‌టంతో ఇలాంటి వేడుక‌ల్లో హీరోల‌ భ‌జ‌న‌లు చూడ‌క త‌ప్ప‌దు. ఐతే తాజాగా త‌మిళంలో శింబు హీరోగా న‌టించిన‌ ఈశ్వ‌ర‌న్ సినిమా ఆడియో వేడుక సంద‌ర్భంగా ఈ భ‌జ‌న మ‌రీ శ్రుతి మించిపోయింది. స్వ‌యంగా ద‌ర్శ‌కుడు సుశీంద్ర‌న్ హీరోను మెప్పించాల‌న్న తాప‌త్ర‌యంలో హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌తో శ్రుతి మించి ప్ర‌వ‌ర్తించి తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌య్యాడు.

నిధి వేదిక మీదికి వ‌చ్చి మైకు ముందు ప్ర‌సంగం ఆరంభించ‌బోతుండ‌గా.. ద‌ర్శ‌కుడు సుశీంద్ర‌న్ ఆమె ప‌క్క‌న నిల‌బ‌డ్డాడు. ఆమె ఏదో మాట్లాడ‌బోతుంటే.. శింబు మామ గురించి చెప్పు, శింబు మామ గురించి చెప్పు అన్నాడు. ఆమె ఏమో సుశీంద్ర‌న్ మంచి డైరెక్ట‌ర్ అంటూ మాట్లాడింది. ఐతే సుశీంద్ర‌నేమో.. నా గురించి మాట్లాడితే వాళ్లు ఒప్పుకోరు (శింబు అభిమానుల‌నుద్దేశించి) శింబు మామ గురించి చెప్పు అన్నాడు.

దీంతో నిధి శింబు గురించి మాట్లాడ్డానికి సిద్ధ‌ప‌డ‌గా.. శింబు మామా ఐ ల‌వ్యూ అని చెప్పు అని ఆమెకు చెప్పాడు. కానీ నిధి అలా చెప్ప‌లేదు. శింబుతో ప‌నిచేయ‌డం త‌న అదృష్ట‌మ‌ని అన‌గా.. కింద త‌మిళంలోనే మాట్లాడ‌తాన‌ని చెప్పి పైకొచ్చి ఇంగ్లిష్ ఏంటి అని సుశీంద్ర‌న్ ప్ర‌శ్నించాడు. దీంతో నిధి బాగా ఇబ్బంది ప‌డుతూ త‌మిళంలో మాట్లాడే ప్ర‌య‌త్నం చేసింది.

శింబుతో ప‌ని చేయ‌డం గురించి చెప్పు, అత‌డితో మ‌ళ్లీ సినిమా చేస్తాన‌ని చెప్పు.. అంటూ నిధికి ఛాన్సే ఇవ్వ‌కుండా సుశీంద్ర‌న్ ఆమెను ఒత్తిడి చేసే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ ప్ర‌సంగం అంత‌టా నిధి హావ‌భావాలు చూస్తే ఆమె ఎంత ఇబ్బంది ప‌డింద‌న్న‌ది స్ప‌ష్టంగా తెలిసిపోతోంది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుండ‌గా.. సుశీంద్ర‌న్‌ను నెటిజ‌న్లు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.