యన్.టి.రామారావు-ఒక చరిత్ర

చిత్రజగతి,చిత్రవిచిత్ర రాజకీయ రణస్థలిలోనూ రాణకెక్కిన రాణ్మౌళి. సరస సమ్మోహన రూపం, నవ నవోన్మేష ప్రతిభా భాస్వంత చైతన్య స్వరూపం నందమూరి తారకరామనామధేయం. ఆయన జీవితం ధ్యేయానికి  కట్టుబడిన అధ్యాయం.నటుడు,నిర్మాత,  దర్శకుడు,నాయకుడు, ప్రతినాయకుడు,ప్రతిపక్షనాయకుడు, మహానాయకుడు, చిత్రకారుడు.చిత్రజీవితంలోనే కాదు,నిజజీవితంలోనూ ఇన్ని పాత్రలు పోషించి,శాసించి, భాసించిన ప్రభంజనుడు.  సామాన్యుడిగా మొదలై, అసామాన్యుడిగా నిలిచి, గెలిచిన నందమూరి తారకరామారావు జన్మదినం మే 28.మరో మూడేళ్లల్లో శతవసంతం సంపూర్ణంకానుంది.నవరసనటసార్వభౌముని కొలుచుకుందాం. తెలుగుపాలకుని తలచుకుందాం.ఆకర్షణకు మరోపేరు అన్నగారు. స్ఫురద్రూపం,వాచకం ఆయన ప్రత్యేకం.ప్రతి అక్షరం, ప్రతి అచ్చు అచ్చంగా, స్వచ్ఛంగా  పలుకుతాయి, మనకు చేరుతాయి.
ఆ కంచుకంఠంలో స్వరవిన్యాసం, నటవిన్యాసం ఏకకాలంలో  ప్రస్ఫుటంగా ప్రకటితమవుతాయి.ప్రతి రసం సహజ సంపూర్ణంగా చిలుకుతుంది. ఉచ్చారణలో ఇంతటి సహజసౌందర్య సంపూర్ణ సుగాత్రుడు తెలుగునటుల్లోనే వేరొక్కరు లేరు.ఎన్టీఆర్ ధరించే ఆభరణాలు కూడా ధ్వనిస్తూ, నటిస్తాయి. భారతచలనచిత్ర జగతిలోనే ఇది అపూర్వం.నటన ఒక ఎత్తు. నడక మరో ఎత్తు.బృహన్నలగా,అర్జునుడుగా, సుయోధనుడుగా, శ్రీరాముడుగా, రావణుడుగా, శ్రీకృష్ణుడుగా ఆన్నీ ఆయనే. కానీ, అది ఎన్.టి.ఆర్ అని మనకు అనిపించదు. ఆ పాత్రలే కనిపిస్తాయి.ఆ  హావభావనట ప్రదర్శనలో వేరొకరు సాటిరారు.అప్పటి వరకూ బృహన్నలగా ఉండి,  అర్జునుడిగా మారిన వెనువెంటనే  వాచక  రూపక స్వరూపాలు చకచకా   మారిపోతాయి. ఇది ఒక నందమూరికే సాధ్యం. శ్రీకృష్ణుడి వాచకం పరమ సాత్వికం, రసరంజితం  - సుయోధనుడిది గాంభీర్యం, రాజరాజసం. ఈ రెండు పాత్రలను ఒక్కడే పోషించి, పండించడం, అమ్మకచెల్ల!  ఎన్ టి ఆర్ ఒక్కడికే చెల్లు. నడి వయస్సులో ముసలి బడిపంతులు పాత్ర పోషించడం  ఎంత సాహసమో? కోడె వయస్సులో ముదిమి భీష్మ పాత్ర వెయ్యడం అంతకు మించిన సాహసం. పౌరాణిక పాత్రలకోసమే ఈయన పుట్టాడో, లేక, ఆ పౌరాణిక పాత్రలే ఈయనగా పుట్టాయో?  పుట్టించునోడికే ఎరుక! దాదాపు ఐదు దశాబ్దాలపాటు తెలుగుసినిమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా వెలిగాడు.సాంఘిక, చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రల్లో జీవించి, తరించాడు.తరగని రసానుభూతుల్ని  కోట్లాది మందికి పంచాడు. మనదేశంతో  మొదలైన మహానటప్రస్థానం  మేజర్ చంద్రకాంత్ వరకూ  జగజ్జేగీయమానంగా సాగింది.జీవనసంధ్యలో, తన ఆరాధ్య శ్రీనాథ కవిసార్వభౌమ పాత్ర కూడా పోషించి, నిర్మించి, ఋషిఋణం, కవిఋణం తీర్చుకున్నాడు.నిడుమోలులో ఓనమాలు నేర్పిన తొలి గురువు వల్లూరి సుబ్బారావు, విజయవాడలో నటప్రస్థానానికి తొలితిలకం దిద్దిన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణల శిష్యరత్నంగా తెలుగుభాషాభిమానాన్ని, తెలుగు ఆత్మగౌరవాన్ని  నరనరాన  చాటుకున్న మేరునగధీరుడు నందమూరి తారకరామారావు.
నటవిరాట్ స్వరూపంగా సకల సౌభాగ్య  సంపదలన్నీ అందుకున్నాడు..కోట్లాదిమంది ప్రజల నుండి పొందిన  అభిమానధనానికి ప్రతిగా  ఏదైనా ఇవ్వాలనుకున్నాడు. సగటుమనిషి కోసం  నిలవాలని నిశ్చయించుకున్నాడు. ప్రతిపౌరుని ఋణం తీర్చుకోవాలని సంకల్పం చేసుకొన్నాడు. తెలుగుప్రజ కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించాడు.తొమ్మిది నెలల్లోనే జయకేతనం ఎగురవేశాడు.ఢిల్లీపీఠాలను గజగజ వణికించాడు. తెలుగుప్రజల్లో రాజకీయ చైతన్యం నింపాడు. యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాలను నాయకులుగా,  మంత్రులుగా చేశాడు.రాజకీయ యవనికలోనూ మహానాయకుడిగా నిలిచాడు.తెలుగు ఆత్మగౌరవ బావుటాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించాడు.  పేదలకోసం,మహిళల కోసం అహరహం తపించాడు. భారతదేశం, అనే పార్టీ స్థాపించి, దేశాన్నీ  ఏలాలని మరో సంకల్పం చేసుకున్నాడు.అది ఒక్కటే సాధించలేక పొయ్యాడు.అది తప్ప ఆన్నీ సాధించాడు.తాను ప్రధానమంత్రి కాలేకపోయినా, వి.పి. సింగ్ ను ప్రధానిగా కూర్చోబెట్టాడు.కింగ్ మేకర్ అయ్యాడు. దేశంలోని కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నీ ఒక్కచోటకు చేర్చి, నేషనల్ ఫ్రంట్ స్థాపించి, దానికి కన్వీనర్ గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాడు.ఏడు  సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  రాజిల్లాడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించి చరిత్రకెక్కాడు. తన పరిపాలనాకాలంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు.ఎన్నో  ప్రయోజక పధకాలు తెచ్చాడు. రాజకీయ జీవితంలో సంచలనాలు,సంచలన విజయాలు,  సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆన్నీ చూశాడు. రాజకీయాల్లో అమేయంగా గెలిచాడు. నిబద్ధత, నిజాయితీ, నిర్భీతి, నిక్కచ్చితనం ఎన్ టి ఆర్ బలాలు. అహం,ఆవేశం, అతివిశ్వాసం  ఆయన బలహీనతలు. మొండితనం ఆయన ఆస్తి. పట్టుదల ఆయన ప్రాణం. మానవత్వం నింపుకున్న మనిషిగా ప్రజలకోసం ప్రతిక్షణం  శ్రమించాడు. అనంతమైన,అనితర సాధ్యమైన,అభేద్యమైన ప్రజాభిమానమే ఆయన ధనం. ఆత్మాభిమానం ఆయన  ఇంధనం. ఈ బలాలు, ఈ ధనాలే ఎన్.టి.రామారావును విజేతగా నిలబెట్టాయి.
అవినీతిరహిత పాలన ఆయన ముద్ర. ప్రజాధనం వృధాకాకుండా చూడడం ఆయన ప్రత్యేకం.పటేల్ పట్వారి వ్యవస్థ నిర్మూలనం, శాసనమండలి రద్దు,  మండలాల స్థాపన ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ, రాయలసీమ క్షేమం కోసం తెలుగుగంగ నిర్మాణం, ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు, కిలో రెండురూపాయల బియ్యం పధకం, విద్యుత్ చార్జీల తగ్గింపు, కార్పొరేషన్ పదవుల సంఖ్య కుదింపు... ఇవ్వన్నీ ఎన్.టి. ఆర్ చేసిన సంస్కరణల, ప్రజాప్రయోజనాల పర్వం. ఏకపక్ష నిర్ణయాలు, ప్రజాప్రతినిధుల పాత్రను విస్మరించడం, ఒకేసారి కేబినెట్ మొత్తం రద్దు చెయ్యడం,తన మీద తనకు అతివిశ్వాసం, తను నమ్మినవారిపట్లా అదే అతివిశ్వాసంగా ఉండడం, చుట్టూ జరుగుతున్న కుట్ర, కుతంత్రాలను, తప్పులను  గమనించకపోవడం మొదలైనవి... ఎన్టీఆర్ రాజకీయజీవితంలో చేదు అనుభవాలు, అపజయాలు, ఆత్మక్షోభ పొందడానికి కారణాలు అయ్యాయి. తెలుగురాష్ట్రంలోనే కాక,  భారతదేశంలోనే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థలను నిర్మించిన ధీశాలి  నందమూరి తారకరామారావు.  స్నేహపాత్రుడు, ప్రేమస్వరూపుడు.గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు ఎప్పుడు వెళ్లినా? తన చిన్ననాటి స్నేహితులను కలువకుండా ఉండడు.గుంటూరు శేషేంద్రశర్మ, సోమరాజు శ్రీహరిరావు ( ఆంజనేయపంతులుగారి కుమారుడు), జగ్గయ్య మొదలైనవారు ఎన్టీఆర్ సహాధ్యాయులు.ముక్కామల, రాజనాల మొదలగు మహానటులంతా ఎన్టీఆర్ స్థాపించిన నేషనల్ ఆర్ట్ ధియేటర్ లో తొలినాళ్ళల్లో  నటించినవారే.విద్యార్థిగా ఉన్నప్పుడే ఈ సంస్థ స్థాపించాడు.తర్వాత ఇదే బ్యానర్ పై అద్భుతమైన అనేక సినిమాలు నిర్మించాడు.
బంధుప్రీతి ఎక్కువైనా? అవినీతికి ఆమడదూరం.అందుకే, ఆయనకు సబ్ రిజిస్ట్రార్ గా తొలి ప్రభుత్వ ఉద్యోగం మూడునాళ్ళ ముచ్చటే అయ్యింది.అక్కడి అవినీతి భరించలేక మూడు వారాల్లోనే ఉద్యోగానికి రాజీనామా చేశాడు.అవినీతి వ్యతిరేక పోరాటం ఆనాడే ప్రారంభించాడు.ముఖ్యమంత్రిగా  కూడా అదే బాటలో  నడిచాడు.ఒక్కమాటలో చెప్పాలంటే?  ఎన్టీఆర్  యుగపురుషుడు.నిమ్మకూరు నుండి నింగివరకూ ఎగిరిన, ఎగసిన  తేజోమూర్తి. ఇంతటి విజయస్వరూపుడైన ఎన్టీఆర్ జీవితం వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ విషాదాంతమైంది.అదే విషాదం.విధి ఆడిన నాటకం.నందమూరి తారకరామారావు పేరున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన పురస్కారాలు ప్రతి సంవత్సరం తప్పకుండా  ప్రదానం చెయ్యడమే నిజమైన నివాళి.రాజకీయాల్లోకి వచ్చినా, కుళ్ళురాజకీయాలకు అతీతుడైన మహానాయకుడు.నటరత్నగా కోట్లాదిమంది ప్రజల హృదయాలు గెలుచుకున్న ఈ నవరస నటనాభిరామునికి 'భారతరత్న' ప్రదానం చెయ్యాలి.రాజకీయాలకు అతీతంగా, అన్ని పార్టీలు ఈ దిశగా కలిసి సాగాలి.తన ఐశ్వర్యం, కీర్తి, వైభవం ఆన్నీ ఆయన రెక్కల కష్టం, ధర్మార్జితం.ఈ మహితాత్ముని స్మృతికి అంజలి ఘటిద్దాం.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.