ఫిబ్రవరి 5న పోలింగ్... మోగిన పంచాయతీ ఎన్నికల నగారా

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పంచాయితీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య ఈ ఎన్నికలు అగ్గి రాజేశాయి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నాహాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే అనుకున్నదాని ప్రకారం జనవరి 23న తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ విడుదల చేశారు. అంబేద్కర్‌ మానసపుత్రికే ఎన్నికల సంఘం అని, సకాలంలో ఎన్నికల నిర్వహణ ఎస్ఈసీ విధి అని అన్నారు. వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ వాయిదా వేయాలంటూ ప్రభుత్వం కోరిందని, అయితే, ఈ విషయంపై సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. ఈ విషయం సుప్రీంలో విచారణలో ఉందని, కాబట్టి, ఎన్నికల ప్రక్రియను ప్రారంభించామని వివరించారు.

నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా, తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగతా 11 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రమేష్ కుమార్ తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్‌, పంచాయతీ ముఖ్య కార్యదర్శిలు హాజరు కావాలని కోరామని చెప్పారు. కొత్త ఓటర్ల జాబితా ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారని, దీంతో 2019 జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐజీ స్థాయి అధికారితో ఏకగ్రీవమయ్యే స్థానాలపై దృష్టిపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి నిధులు, సిబ్బంది కొరత వంటి సమస్యలున్నాయని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కోర్టు చెప్పినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ప్రభుత్వ ఉదాసీనత వైఖరిపై గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

పంచాయతీ ఎన్నికల మొదటి దశ శనివారం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 5న సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ ఎన్నికతో ముగియనుంది. జనవరి 23న నోటిఫికేషన్‌ జారీ కాగా.. ఈ నెల 25నుంచి 27వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. 28న నామినేషన్ల పరిశీలన, 29 నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన, 30న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం, 31న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు). అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 5న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 పోలింగ్‌ జరుగనుంది. పోలింగ్‌ పూర్తయ్యాక సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఫలితాల వెల్లడించనున్నారు. ఆ తర్వాత ఉప సర్పంచ్‌ ఎన్నిక పూర్తి చేయడంతో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. మరి, ఈ ఎన్నికల నోటిఫికేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఎలా ఉండబోతోంది, సుప్రీం కోర్టు ఏం తీర్పు చెప్పబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.