రేవంత్ పాదయాత్ర ఎఫెక్ట్.. రెండుగా చీలిన టీ కాంగ్రెస్?

అనూహ్యంగా చేశారో.. పక్కా ప్లాన్ తో చేశారో కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా యాత్ర.. పార్టీలో పెద్ద కుదుపునకు కారణమైందని చెబుతున్నారు. ఇప్పటివరకు అంతర్గత లుకలుకలతో కిందామీదా పడుతున్న పార్టీ.. తాజాగా జరిగిన పరిణామాలతో రెండుగా చీలినట్లుగా చెబుతున్నారు.

రేవంత్ కు మద్దతుగా నిలిచేవారు ఒక పక్క.. మరోవైపు ఉత్తమ్ వర్గంగా చీలిక చోటు చేసుకుందని చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా రేవంత్ పాదయాత్ర ముగింపు సందర్భంగా హాజరైన నేతలు.. గైర్హాజరు నేతల లెక్కే స్పష్టం చేస్తున్నట్లుగా చెప్పక తప్పదు.

రేవంత్ పాదయాత్రపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆయన ఎవరి అనుమతి తీసుకొని పాదయాత్ర చేశారన్న ప్రశ్నను పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు..పార్టీకి మంచి జరిగితే దాన్ని స్వాగతించకుండా.. ఈ వర్గాలు.. కూటములు ఏమిటని ప్రశ్నించేటోళ్లు లేకపోలేదు.  ఎవరి అనుమతి లేకుండా తనకు తానుగా తీసుకున్న  పాదయాత్ర ముగింపు సభకు తాము ఎవ్వరం హాజరు కాకూడదన్న మాటను ఉత్తమ్ అండ్ కో అనుకున్నట్లే చేశారు.

సభకు హాజరు కావాల్సిందిగా ఉత్తమ్.. సీఎల్పీ నేత భట్టితో సహా రాష్ట్రంలోని పార్టీ ముఖ్యుల్ని పిలిచినా.. వారెవరూ రాలేదంటున్నారు. సీనియర్లు జానారెడ్డి.. జీవన్ రెడ్డి.. ఉత్తమ్ లాంటి వారు గైర్హాజరు అయినా.. రేవంత్ సభకు 16 డీసీసీ అధ్యక్షులతోపాటు.. కార్య నిర్వాహఖ అధ్యక్షులు కూడా హాజరయ్యారు. మాజీ మంత్రులు చిన్నారెడ్డి.. కొండా సురేఖ ప్రధాన ఆకర్షణగా మారారు. ఎమ్మెల్యే సీతక్క.. సంభాని చంద్రశేఖర్.. షబ్బీర్ అలీ.. బలరాం నాయకో.. దాసోజు శ్రవణ్.. ఇందిరా శోభన్.. మానవతారాయ్ తదితరులు హాజరయ్యారు.

మొత్తంగారేవంత్ పాదయాత్ర ముగింపు సభ.. పార్టీలో నెలకొన్న లుకలుకల్ని మరో స్థాయికి తీసుకెళ్లినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఇలాంటివి కాంగ్రెస్ లో మామూలేనని.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న మాట కొందరి నోట వినిపించటం గమనార్హం.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.