సెన్సెక్స్ 50,000 వేలకు చేరింది... ఎక్కడ మొదలైందో తెలుసా?

మిగిలిన రోజుల మాదిరే 21-01-2021 ఎంత మాత్రం కాదు. దేశప్రజలు పెద్దగా పట్టకున్నా.. షేర్ మార్కెట్ మీద అవగాహన ఉన్న వారితో.. దానితో రిలేషన్ ఉన్న వారందరికి ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఎప్పుడెప్పుడా అని మదుపరులు ఎదురుచూసిన ఘట్టం తాజాగా ఆవిష్కారం కావటమే కాదు..విశ్లేషకులు అంచనాల్ని నిజం చేస్తూ.. సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 50వేల పాయింట్లను ముద్దాడిన వైనం ఇప్పటికి..ఎప్పటికి ప్రత్యేకమనే చెప్పాలి.

గురువారం సెన్సెన్స్ సూచీ 50వేల మార్కును దాటి.. కాసేపటికి తగ్గినప్పటికి.. 50కెను టచ్ చేయటం అపూర్వమని చెబుతున్నారు. 35 ఏళ్ల క్రితం మొదలైన చిన్న ప్రయాణం.. నేడు చరిత్రలో లిఖించదగ్గ రోజుగా మారింది. 50వేల మార్కును టచ్ చేసి.. ఆపైన మరికొంత దూసుకెళితే పరిస్థితి మరోలా ఉండేది. కానీ.. అంతలోనే పడిపోవటం కాసింత నిరాశను కలిగించినా.. 50వేల మార్కు అందనంత ఏమీ కాదన్న విషయం తాజాగా స్పష్టమైందని చెప్పాలి.

గురువారం ఉదయం 50వేల మార్కును దాటి.. అనంతరం 148 పాయింట్లు పెరిగి సరికొత్త గరిష్ఠ స్థానానికి చేరుకున్నా.. తర్వాత మాత్రం  49,624 పాయింట్ల వద్ద ముగిసింది.
1875లోనే బాంబే స్టాక్ ఎక్స్యేంజ్ ఏరపాటైంది. ఇది జరిగిన 111 ఏళ్లకు అంటే.. 1986లో సెన్సెక్స్ ఏర్పడింది. తొలుత దీన్ని వంద పాయింట్లతో మొదలు పెట్టారు. సెన్సిటివ్ ఇండెక్స్ అనే పదాల్ని కలిపిన దీపక్ మొహానీ అనే స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు సెన్సెక్స్ గా నామకరణం చేశారు.
సెన్సెక్స్ ను ఏర్పాటు చేసిన నాలుగేళ్లకు తొలిసారి వెయ్యి పాయింట్లకు చేరింది. 1991లో ప్రధానిగా పీవీ ఉన్న వేళలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో సానుకూల వాతావరణం ఏర్పడింది. 1992లోహర్షద్ మెహతా స్కాంతో కాస్త బ్రేకులపడ్డాయి. దీంతో.. 5వేల పాయింట్లకు చేరుకోవటానికి దాదాపు పదేళ్ల సమయం పట్టింది.
2006లో పదివేల మార్కు దాటితే.. ఏడాదిలోనే 20వేల పాయింట్లకు చేరుకుంది. 2008లో చోటు చేసుకున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో సెన్సెక్స్ చక్రాలకు స్పీడ్ తగ్గి భారీ నస్టాలను మూటగట్టుకుంది. 2014లో మోడీ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత 25వేల మార్కును దాటిన సెన్సెక్స్ కేవలం ఏడేళ్ల వ్యవధిలో మళ్లీ 50వేల అత్యున్నత స్థానాన్ని టచ్ చేసింది.

2020 మార్చిలో కరోనా దెబ్బకు సెన్సెక్స్ 25వేల పాయింట్లకు పడిపోతే.. కేవలం పది నెలల వ్యవధిలోనే 50వేల మార్కును చేరుకోవటం చూస్తే.. ఆశ్చర్యంగా అనిపించక మానదు. అదే సమయంలో ఒకప్పుడు ఐదువేల పాయింట్లకు పదేళ్లు పడితే.. తాజాగా 45వేల మార్కు నుంచి 50వేల మార్కుకు చేరుకోవటానికి 35 రోజులు మాత్రమే పట్టాయంటే.. సెన్సెక్స్ దూకుడు ఏ స్థాయిలో  ఉందో ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.