ట్రంప్ కు భారీ షాకిచ్చిన జుకర్ బర్గ్

NRI

గడిచిన 24 గంటల్లో అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలపై ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ స్పందించారు. సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశంలో అల్లర్లను ప్రోత్సహించే చర్యలకు తమ మద్దతు ఉండదన్న విషయాన్ని ఫేస్ బుక్ అధినేత స్పష్టం చేయటమే కాదు.. అందుకు అవకాశం ఉన్న ట్రంప్ ఫేస్ బుక్.. ఇన్ స్టా పేజీని రెండు వారాల పాటు బ్లాక్ చేసినట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి తాజాగా ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.  ట్రంప్ పోస్టులు అల్లర్లను ప్రోత్సహించేలా ఉన్నాయని.. అందుకే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ కు అధికారాన్ని అప్పగించటానికి బదులుగా.. తన మద్దతు దారులతో క్యాపిటల్ భవనం దగ్గర చేసిన రచ్చ.. అమెరికా చరిత్రలో మచ్చగా మిగిలిపోతుంది. ఊహించనిరీతిలో చోటు చేసుకున్న ఈ వైనం ప్రపంచ వ్యాప్తంగా షాకింగ్ గా మారింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. తన వారసుడ్ని ఎంపిక విషయంలో ట్రంప్ అనుసరించిన వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ సంచలన పోస్టు పెట్టారు. అందులోఅధ్యక్షుడు ట్రంప్ తీరును తప్పు పట్టారు. ఆ విషయాన్ని ఆయన సూటిగా.. స్పష్టంగా చెప్పేశారు. ‘గత 24 గంటలుగా జరుగుతునన ఘటనలు షాక్ కు గురి చేస్తున్నాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న ట్రంప్.. తన వారసుడికి శాంతియుతంగా.. చట్టబద్ధమైన అధికార మార్పిడికి బదులుగా.. దానిని అణగదొక్కాలని చూడటం స్పష్టంగా కనిపించింది. క్యాపిటల్ భవనంలోకి తన మద్దతుదారుల చర్యల్ని ఖండించకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని కలవరపెట్టింది’ అని పేర్కొన్నారు.


తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఫేస్ బుక్ అధినేత కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన పేర్కొంటూ.. ‘‘కాంగ్రెస్ ఎన్నికల ఫలితాల ధ్రువీకరణ తర్వాత మిగిలిన 13 రోజులు, కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే దాక దేశంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్య నిబంధనలకు అనుగుణంగా ఆ ప్రక్రియ జరగాలి. గత కొన్నేళ్లుగా మేము మా వేదికపై ట్రంప్ ఎటువంటి పోస్టులు చేసినా అడ్డు చెప్పలేదు. అందులో మా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని మాత్రం తొలగించాం. వివాదాస్పదమైన వాటిని నిలువరించాం. రాజకీయ ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రజలలో చీలికలు తీసుకొచ్చే అవకాశం ఉందని మేము విశ్వసిస్తున్నాం. అందుకే పోస్టుల్ని డిలీట్ చేశాం. తాజా సందర్భం అందుకు భిన్నంగా ఉంది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోబడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక తిరుగుబాట్లను మా వేదిక ద్వారా చేస్తామంటే మేం అంగీకరించం. పెద్ద ఎత్తున అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున.. మేము ట్రంప్ అధికారిక ఫేస్ బుక్.. ఇన్స్టాగ్రాం పేజీలను మరో రెండు వారాల దాకా బ్లాక్ చేస్తున్నాం..’  అని స్పష్టం చేశారు. తమ కఠిన నిర్ణయంతో జుకర్ బర్గ్ దిమ్మ తిరిగే షాకిచ్చారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.