ట్రంప్ దూకుడుపై `విజ‌యా`స్త్రం!

NRI
అమెరికా అధ్య‌క్షుడి ట్విట్ట‌ర్ ఖాతా స‌స్పెన్ష‌న్ వెనుక తెలుగు వ‌నిత‌
స‌రైన స‌మ‌యంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న 'విజ‌య గ‌ద్దె'
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌న ఓట‌మిని అంగీక‌రించ‌కుండా మొండిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న వ్యాఖ్య‌లు, ట్వీట్ల ద్వారా అరాచ‌కం సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. మ‌రోవైపు  అమెరికా క్యాపిట‌ల్ హిల్‌ వ‌ద్ద ట్రంప్ మ‌ద్ద‌తు దారులు ఆందోళ‌న‌లకు దిగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ట్రంప్ ట్విట్ట‌ర్ అకౌంట్ శాశ్వ‌తంగా స‌స్పెండ్ అయింది. నిజానికి అగ్ర‌రాజ్యం అధ్య‌క్షుడు, ప్ర‌పంచంలోనే అత్య‌ధిక మంది ఫాలోవ‌ర్లు ఉన్న ట్రంప్ ట్విట్ట‌ర్ ఖాతా శాశ్వ‌తంగా స‌స్పెండ్ కావ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. మ‌రి ఇంత కీల‌క, సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక ఎవ‌రున్నారు.. అనే సందేహం స‌హ‌జం.

విష‌యంలోకి వెళ్తే.. ట్రంప్ ట్విట్ట‌ర్ ఖాతాను తొలిసారి శుక్ర‌వారం శాశ్వ‌తంగా స‌స్పెండ్ చేయ‌డం వెనుక ట్విట్ట‌ర్ టాప్ లాయ‌ర్ 'విజ‌య గ‌ద్దె' కీల‌క పాత్ర పోషించారు. 45 ఏళ్ల 'విజ‌య గ‌ద్దె.'.. భార‌త దేశానికి చెందిన  మ‌హిళ‌.  కంపెనీ లీగ‌ల్ హెడ్ గానే కాకుండా విధాన నిర్ణ‌యాలు, విశ్వ‌స‌నీయ‌త‌, భ‌ద్ర‌త వంటి కీల‌క విష‌యాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ట్రంప్ ట్విట్ట‌ర్ ఖాతాను స‌స్పెండ్ చేయ‌డంపై 'విజ‌య గ‌ద్దె 'ఏమ‌న్నారంటే.. ``డొనాల్డ్ ట్రంప్ ఎకౌంట్‌ను శాశ్వ‌తంగా తొల‌గించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు పెర‌గ‌కూడ‌ద‌నే. మా  విధానాల‌ను ఇప్ప‌టికే ప్ర‌చురించాం`` అని పేర్కొన్నారు.

భార‌త్‌లో జ‌న్మించిన 'విజ‌య గ‌ద్దె'.. చిన్న వ‌య‌సులో త‌న తండ్రితో క‌లిసి అమెరికాకు వెళ్లిపాయారు. టెక్సాస్‌లో పెరిగారు. విజ‌య తండ్రి  గ‌ల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని చ‌మురు  క‌ర్మాగారాల్లో కెమిక‌ల్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేశారు. త‌ర్వాత కాలంలో గ‌ద్దె కుటుంబం ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో కొన్నాళ్లు ఉంది. ఈ క్ర‌మంలోనే న్యూజెర్సీలోని హైస్కూల్లో విజ‌య చ‌దువు పూర్తి చేసుకున్నారు. కార్నెల్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. అదేవిధంగా న్యూయార్క్ యూనివ‌ర్సిటీలో లా అభ్య‌సించారు. 2011లో సోష‌ల్ మీడియా కంపెనీలో చేర‌క‌ముందు.. తీర‌ప్రాంతంలోని టెక్ స్టార్ట‌ప్స్‌లో ద‌శాబ్దానికి పైగా ప‌నిచేశారు.

కార్పొరేట్ లాయ‌ర్‌గా గుర్తింపు పొందిన 'విజ‌య గ‌ద్దె.'. విధాన రూప‌క‌ల్ప‌న‌లో త‌న‌దైన ముద్ర వేశారు. గ‌త ద‌శాబ్ద కాలంలో ట్విట్ట‌ర్‌ను మ‌రింతగా అభివృద్ది చేయ‌డంలో విజ‌య ఆలోచ‌న‌లు ఎంత‌గానో ప‌నిచేశాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా రాజ‌కీయ రంగంలో ట్విట్ట‌ర్ ప్రాధాన్యం ఊహించ‌ని విధంగా శ‌ర వేగంతో దూసుకుపోయేలా విజ‌య విధానాలు దోహ‌ద‌ప‌డ్డాయి. దీంతో 'విజ‌య గ‌ద్దె'కు కంపెనీలో ఎన‌లేని ప్రాధాన్యం పెరిగింది. ఎంత‌గా అంటే.. ట్విట్ట‌ర్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈవో 'జాక్ డార్సీ' గ‌త ఏడాది అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌తో ఓవెల్ ఆఫీస్(అధ్య‌క్షుడి అధికారిక స‌మావేశ కార్యాల‌యం)లో భేటీ అయిన‌ప్పుడు, 2018 న‌వంబ‌రులో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో భేటీ అయిన‌ప్పుడు 'విజ‌య గ‌ద్దె 'పాల్గొన్నారు. ఈ విష‌యాన్ని `ఫార్ట్యూన్‌` ప్ర‌ముఖంగా పేర్కొంది.

అంతేకాదు, భార‌త ప‌ర్య‌ట‌న‌లో జాడ్ డార్సీ.. ప్ర‌ముఖ ఆధ్మాత్మిక వేత్త ద‌లైలామాను క‌లిసిన‌ప్పుడు కూడా 'విజ‌య గ‌ద్దె' ఈ స‌మావేశానికి హాజరుకావ‌డం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించి డార్సీ.. ఒక ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో డార్సీ-ద‌లైలామాల మ‌ధ్య‌లో 'విజ‌య గ‌ద్దె' నిల‌బ‌డి ఉండ‌డ‌మే కాదు.. ద‌లైలామా చేతిని ప‌ట్టుకుని ఉండ‌డం గ‌మ‌నార్హం. అమెరికా మీడియా 'విజ‌య గ‌ద్దె 'కృషిని ఎంత‌గానో కొనియాడింది. వృత్తి నిబ‌ద్ధ‌త‌ను ప్ర‌ముఖంగా ప్రస్థావించింది. ``ఇప్ప‌టి వ‌ర‌కు మీరు విన‌ని అత్యంత శ‌క్తి మంత‌మైన సోష‌ల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌.. 'విజ‌య గ‌ద్దె'`` అని రాజ‌కీయ నేత‌లు సైతం శ్లాఘించ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు, ప్ర‌ముఖ మ్యాగ‌జైన్‌.. `ఇన్‌స్ట‌యిల్`.. `దిబ్యాడాస్ 50, 2020`లో 'విజ‌య గ‌ద్దె'కు చోటు క‌ల్పించింది. ప్ర‌పంచంలోనే స‌వాళ్ల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డే మ‌హిళ‌గా అభివ‌ర్ణించింది.  ఒక్క సోష‌ల్ మీడియాలోనే కాదు.. 'విజ‌య గ‌ద్దె'లో భిన్న‌మైన పార్శ్వాలు ఉన్నాయి. `ఏంజెల్స్` కో ఫౌండ‌ర్‌గా విజ‌య కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా స్టార్ట‌ప్‌ల‌కు పెట్టుబ‌డుల ద్వారా ఊతం క‌ల్పిస్తున్నారు. అంతేకాదు, ప్ర‌ముఖ కంపెనీల్లో పురుషుల‌తో పాటు.. మ‌హిళ‌ల‌కు కూడా స‌మాన వేత‌నాలు అందేలా కృషి చేస్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.