వైసీపీ లోపల ఇప్పుడు పెద్ద ప్రశ్న ఇదే. ఎందుకంటే పార్టీ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు జగన్ ఇచ్చే సమాధానాలే కొత్త వివాదాలకు కారణమవుతున్నాయని నేతలే అంగీకరించడం ప్రారంభించారు. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆత్మపరిశీలన చేస్తుంది. పరాజయాలపై విశ్లేషణ, ప్రజల అసంతృప్తిని అర్థం చేసుకోవడం, తప్పుల్ని సరిచేసుకుని తిరిగి పుంజుకోవడం.. ఇది రాజకీయాల్లో జరిగే సాధారణ ప్రక్రియ. కానీ వైసీపీ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ప్రజలు ఏ అంశంలో అసంతృప్తిగా ఉన్నారని తెలుసుకోవడం కంటే, ప్రతి విమర్శను సమర్థించుకోవడంలోనే ఎక్కువ టైమ్ ఖర్చవుతున్నట్లు పార్టీ లోపలే చర్చ జరుగుతోంది.
ఎన్నికలలో వైసీపీకి భారీ షాక్ ఇచ్చిన ప్రజలు ఇప్పటికీ కొన్ని ముఖ్య అంశాలపై స్పష్టమైన సమాధానాలు కోరుతున్నారు. తిరుమల లడ్డూ కల్తీ, పరకామణి, అమరావతి, ఆర్థిక సంక్షోభం.. ఈ విషయాల్లో ప్రజా భావన చాలా స్పష్టంగా ఉంది. కానీ జగన్ వ్యాఖ్యలు చూస్తే, ఏ సమస్యను కూడా అంగీకరించకుండా, తప్పే జరగలేదని చెప్పడం ప్రధాన పాయింట్‌గా మారింది. సీబీఐ రిపోర్ట్ లడ్డూకు కల్తీ నెయ్యి వాడారని స్పష్టంగా తేల్చి చెప్పినా.. జగన్ ఎక్కడా కల్తీ జరగలేదని వాదించడం వైసీపీకే సమస్యగా మారింది.
పరకామణి కేసు విషయంలో కూడా జగన్ స్పందన ఇదే తరహాలో ఉండటం ప్రజల్లో అసహనాన్ని రేపుతోంది. శ్రీవారి నగదును కొట్టేయడమే పెద్ద తప్పని ప్రజలు భావిస్తుంటే.. జగన్ దీనిని చాలా లైట్ తీసుకున్నారు. పైగా ఈ అంశాన్ని రాజకీయ కారణంగానే పెద్దది చేస్తున్నారని సమర్థించుకున్నారు. నిజానికి భక్తుల భావాలు దెబ్బతిన్నప్పుడు నాయకుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఈ విషయాన్ని జగన్ గాలికి వదిలేశారు.
నీతి–పాలనపై ప్రశ్నలు వచ్చినప్పుడల్లా జగన్ ఇచ్చే సమర్థనలు ఒక దశలో స్వీయ ప్రశంసలులా మారుతున్నాయి. అమరావతి, రైతుల సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. ఏ అంశం వచ్చినా గత పాలనపై బల్లగుద్దుతూ, తమ పాలనకే మార్కులు వేస్తూ మాట్లాడడం ప్రజల్లో నమ్మకం తగ్గించే దిశగా వెళ్తోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తప్పులు ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు… కానీ తప్పే లేదనడం ప్రజలను మరింత దూరం చేస్తుంది. ప్రజలతో మళ్లీ కనెక్ట్ కావాలంటే, ముందు ప్రజల మాట వినాలి. ప్రజల అసంతృప్తిని అంగీకరించాలి. తప్పులపై నిజాయితీతో స్పందించాలి. కానీ ఇది జరగకపోతే వైసీపీ పుంజుకునే అవకాశాలు తగ్గిపోతాయని సొంత పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మొత్తానికి జగన్ సమర్థనలే ఇప్పుడు పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయనే టాక్ అంతర్గతంగా బలంగా వినిపిస్తోంది.