మంచు ఫ్యామిలీపై కిడ్నాప్ కేసు.. మోహ‌న్ బాబు యూనివర్శిటీలో ఏం జరుగుతోంది?

admin
Published by Admin — February 04, 2026 in Andhra, Movies
News Image

సినీ దిగ్గజం, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరియు ఆయన కుమారుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చుట్టూ ఇప్పుడు తీవ్ర వివాదం ముదురుతోంది. ఎప్పుడూ క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే మోహన్ బాబు యూనివర్శిటీ కిడ్నాప్ ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. అసలు ప్రశాంతంగా ఉండాల్సిన విద్యాసంస్థలో ఏం జరుగుతోంది? విద్యార్థి నేతలను పట్టపగలే కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఇదే అంశం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగింది?
తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో ఉన్న మోహన్ బాబు యూనివర్శిటీలో భారీగా ఫీజుల దోపిడీ జరుగుతోందని, అక్రమాలు పెరిగిపోయాయని ఎస్ఎఫ్ఐ (SFI) విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై నిరసన తెలిపేందుకు కలెక్టరేట్‌కు బయలుదేరిన ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్‌లను తిరుచానూరు సమీపంలో కొందరు దుండగులు అడ్డుకున్నారు. దాదాపు 30 మంది వ్యక్తులు సినిమా స్టైల్‌లో వచ్చి, వీరిద్దరినీ బలవంతంగా ఓ వాహనంలోకి ఎక్కించుకుని అపహరించడం స్థానికంగా కలకలం రేపింది.

విద్యార్థి నేతల కిడ్నాప్ విషయం తెలియగానే సీపీఎం నేత కందారపు మురళి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీఐ సునీల్ కుమార్ నేతృత్వంలో మూడు బృందాలుగా విడిపోయి కిడ్నాపర్ల వాహనాన్ని వెంబడించారు. సుమారు గంటన్నర పాటు హైడ్రామా నడిచింది. చివరకు పోలీసులు కిడ్నాపర్లను పట్టుకుని, బాధితులను సురక్షితంగా రక్షించారు. నిందితుల వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఏ2గా మోహన్ బాబు.. ఏ3గా మంచు విష్ణు!
బాధితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో షాకింగ్ అంశం ఏమిటంటే.. నిందితుల జాబితాలో మంచు కుటుంబ సభ్యుల పేర్లు ఉండటం. ఏ1గ యూఆనివర్శిటీ పీఆర్వో సతీశ్, ఏ2గా మంచు మోహన్ బాబు, ఏ3గా మంచు విష్ణు పేర్ల‌ను చేర్చారు. యూనివర్శిటీ యాజమాన్యం ప్రోద్బలంతోనే ఈ కిడ్నాప్ జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. విద్యాసంస్థలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తే ఇలాంటి దాడులకు పాల్పడటం ఏంటని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

గత కొంతకాలంగా మోహన్ బాబు యూనివర్శిటీపై రకరకాల ఆరోపణలు వస్తున్నప్పటికీ, ఈ కిడ్నాప్ కేసు వ్యవహారం మంచు ఫ్యామిలీకి పెద్ద తలనొప్పిగా మారింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట ఇలాంటి ‘రౌడీయిజం’ ఏంటని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు. మ‌రి ఈ వివాదంపై మంచు ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది..? ఈ కేసులో పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏంటి..? వంటి విష‌యాలు తెలియాల్సి ఉంది.

Tags
Mohan Babu Manchu Vishnu Kidnap Case Mohan Babu University SFI Manchu Family
Recent Comments
Leave a Comment

Related News