న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న `ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్`లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. మంగళవారం ఉదయం విడుదలైన సదస్సు ప్రధాన వక్తల జాబితా నుంచి ఆయన పేరును తొలగించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. సోమవారం వరకు ఈ సదస్సులో కీలక ప్రసంగం చేయాల్సిన గేట్స్, ఒక్కసారిగా జాబితా నుంచి మాయమవ్వడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
లైంగిక వేధింపుల నేరగాడు జెఫ్రీ ఎప్ స్టీన్ చుట్టూ అల్లుకున్న వివాదాలే బిల్ గేట్స్‌ను ఇక్కట్లలో పడేసినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన `ఎప్ స్టీన్ ఫైల్స్`లో బిల్ గేట్స్ పేరు వెలుగులోకి రావడంతో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. మహిళా భద్రత, బాధితులకు అండగా నిలవడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ప్రకటించిన కేంద్రం, వివాదాస్పద వ్యక్తులు ప్రభుత్వ వేదికలపై ఉండటం సరికాదని భావించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు ఇచ్చిన ఆహ్వానాన్ని పునఃసమీక్షించి, సదస్సుకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఐటీ, ఏఐ రంగాల్లో సహకారంపై చర్చలు జరిపారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకుని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో ఏఐ పాత్రపై ప్రసంగించాల్సి ఉంది. అయితే, ఆయన ఢిల్లీకి చేరుకునే లోపే సీన్ మొత్తం మారిపోయింది. మోదీ సర్కార్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో గ్లోబల్ టెక్ వర్గాల్లో చర్చ మొదలైంది.
బిల్ గేట్స్ దూరమైనప్పటికీ, సదస్సు మాత్రం ప్రణాళిక ప్రకారమే సాగుతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సృష్టికర్త సామ్ ఆల్ట్‌మాన్ వంటి దిగ్గజాలు ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నారు. భారత భవిష్యత్తును మార్చే కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీపై కీలక చర్చలు జరుగుతున్నాయి.