ఏపీ(AP)లో విజయవాడ రాజకీయం అంటేనే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఉత్కంఠ ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రతి పరిణామం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం మారుతుంది. తాజాగా మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు కావడంతో బెజవాడ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి అన్‌రిజర్వ్‌డ్ జనరల్ కేటగిరీకి కేటాయించడమే ఈ రాజకీయ కల్లోలానికి ప్రధాన కారణమైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో, బెజవాడ రాజకీయాల్లో దశాబ్దాలుగా ప్రత్యేక బ్రాండ్ ఉన్న వంగవీటి కుటుంబం నుంచి రాధాకృష్ణ పేరు తెరపైకి రావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్న వంగవీటి రాధా(Vangaveeti Radha), ఈసారి నేరుగా మేయర్ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రస్తుత రాజకీయ సమీకరణాల ప్రకారం, టీడీపీ(TDP) నుంచి కాకుండా వంగవీటి రాధా జనసేన పార్టీ తరఫున విజయవాడ మేయర్ బరిలో నిలిచే అవకాశం ఉందనే చర్చ గట్టిగా వినిపిస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్‌తో రాధాకు ఉన్న సత్సంబంధాలు, ఆయనకున్న వ్యక్తిగత మాస్ ఇమేజ్ ఈ ఊహాగాదాలకు బలం చేకూరుస్తున్నాయి. కూటమి పొత్తుల్లో భాగంగా విజయవాడ మేయర్ స్థానాన్ని జనసేన దక్కించుకోవాలని భావిస్తోందని, ఆ పార్టీ తరఫున బెజవాడను గెలుచుకునే సరైన నాయకుడిగా రాధా సరిగ్గా సరిపోతారని ఆయన మద్దతుదారులు బలంగా విశ్వసిస్తున్నారు.
పైగా విజయవాడ(Vijayawada) సెంట్రల్ సహా పలు నియోజకవర్గాల్లో వంగవీటి రంగా అభిమానులు, రాధాకు వ్యక్తిగతంగా బలమైన కేడర్ ఉంది. నగరంలో ఆయనకు ఉండే ఓటు బ్యాంకు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. మేయర్ స్థానం జనరల్ కావడంతో అన్ని పార్టీల నుంచి ఆశావహులు క్యూ కడుతున్నప్పటికీ, రాధా రంగంలోకి దిగితే మాత్రం ఇక్కడ పోరు నూటికి నూరుపాళ్లు రంజుగా మారుతుంది.
ఇదిలా ఉంటే, కేవలం వంగవీటి రాధా మాత్రమే కాకుండా ఆయన సతీమణి పుష్పవల్లి పేరు కూడా మేయర్ రేసులో వినిపిస్తుండటం మరో ఆసక్తికర పరిణామం. ఒకవేళ రాధా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మరోసారి పూర్తిస్థాయిలో దూకాలని నిర్ణయించుకుంటే, వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ కీలక స్థానం నుంచి బరిలో నిలవడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రాధా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)లను వేర్వేరుగా కలవడం వెనుక ఈ వ్యూహాత్మక చర్చలే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, దశాబ్దాల బెజవాడ రాజకీయ చరిత్రలో మరోసారి వంగవీటి కుటుంబం నగర పీఠం కోసం అడుగులు వేస్తుండటం ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ నుంచి ఆశావహులైన నేతలు ఈ పరిణామాలను ఎలా రిసీవ్ చేసుకుంటారు, కూటమిలో ఈ స్థానం ఏ పార్టీకి దక్కుతుంది, చివరకు రాధా ఏ పార్టీ కండువా కప్పుకుని బరిలోకి దిగుతారనే ప్రశ్నలకు త్వరలోనే పూర్తి స్పష్టత రానుంది.