జగన్ స్కెచ్‌.. దేవినేని వారసుడు మ‌ళ్లీ బ‌లి.!

admin
Published by Admin — October 15, 2026 in Politics, Andhra
News Image

బెజవాడ రాజకీయం మరోసారి హీటెక్కింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా పాతాలనే లక్ష్యంతో అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఆయన ఎంచుకున్న అస్త్రమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. నగరంలో పార్టీని పరుగులు పెట్టించే బలమైన నాయకుడు కరవైన తరుణంలో.. దివంగత ప్రముఖ నేత దేవినేని నెహ్రూ కుమారుడు, యువ నాయకుడు దేవినేని అవినాష్‌ను మేయర్ బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. కానీ, పైకి కనిపిస్తున్న ఈ రాజకీయం వెనుక అవినాష్‌ను మరోసారి రాజకీయ బలిపీఠం ఎక్కించే ప్రమాదకరమైన స్కెచ్ నడుస్తోందనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి.

రాజకీయాల్లో ప్రతి అడుగు చాలా లెక్కలతో వేయాలి. కానీ అవినాష్(Devineni Avinash) ట్రాక్ రికార్డును గమనిస్తే ఆయనకు అదృష్టం కలిసి రావడం లేదనేది సుస్పష్టం. ఇప్పటివరకు ఆయన పోటీ చేసిన ప్రతిసారీ పరాజయమే ఎదురైంది. 2014లో ఎంపీగా, 2019లో గుడివాడ శాసనసభ్యుడిగా టీడీపి నుంచి బరిలో దిగి చవిచూసిన ఓటములు ఆయన్ని వెన్నాడుతూనే ఉన్నాయి. ఇక పార్టీ మారిన తర్వాత 2024 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి వైసీపీ కేడర్‌ను నడిపించినా, కూటమి ప్రభంజనంలో ఆయన ఘోర ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. తండ్రి సంపాదించుకున్న లెజెండరీ బ్రాండ్ ఇమేజ్‌ను నమ్ముకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని పట్టకోవడంలో అవినాష్ వరుసగా విఫలమవుతూనే వస్తున్నారు.

ఇలాంటి సమయంలో ప్రత్యక్ష పద్ధతిలో జరిగే మేయర్ పోరుకు ఆయనను సిద్ధం చేయడం అంటే కంటకప్రాయమే. గతంలో మాదిరిగా కార్పొరేటర్ల మద్దతుతో జరిగే పరోక్ష ఎన్నిక కాదు ఇది. విజయవాడ(Vijayawada) నగరంలోని లక్షలాది మంది ఓటర్లు నేరుగా తీర్పునిచ్చే అతిపెద్ద ప్రజాస్వామ్య పోరు. ప్రస్తుత రాజకీయం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా ఉన్న ఈ సమయంలో.. అవినాష్‌ను రంగంలోకి దించడం అంటే ఓటమిని ఆహ్వానించడమే అవుతుంది. గడచిన ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న వివాదాలు, తలెత్తిన క్రిమినల్ కేసులు ఆయనపై ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపాయి. ఈ పరిస్థితుల్లో మరోసారి ఎన్నికల బరిలో నిలబడి భారీ తేడాతో ఓడిపోతే, అది ఆయన రాజకీయ జీవితానికి కోలుకోలేని శాశ్వత ఎదురుదెబ్బగా మారుతుంది.

ఒకరిద్దరు నేతల ఒత్తిడికి తలొగ్గి, అధినేత ఇస్తున్న హామీలను నమ్మి అవినాష్ మళ్లీ ముందుకెళితే.. దేవినేని కుటుంబానికి(Devineni Family) ఇప్పటికీ ప్రజల్లో ఉన్న కొద్దిపాటి ఆదరణ, ప్రతిష్ట కూడా పూర్తిగా మసకబారే ప్రమాదం ఉంది. పార్టీలో సరైన దిశానిర్దేశం చేసే నాథుడు లేక, సరైన ఆర్థిక, నైతిక అండదండలు కరువైన వేళ.. బలవంతంగా బరిలో దిగి ఆత్మహత్యాసదృశమైన తప్పిదానికి పాల్పడవద్దని ఆయన శ్రేయోభిలాషులు, సన్నిహితులు హెచ్చరిస్తున్నారు. జగన్ వేస్తున్న ఈ పొలిటికల్ ట్రాప్‌లో పడితే, భవిష్యత్‌లో మరోసారి నిలదొక్కుకునే అవకాశమే ఉండదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ ప్రమాదకర వ్యూహాన్ని అవినాష్ గ్రహించి వెనక్కి తగ్గుతారా, లేక బలిపశువు కావడానికి సిద్ధపడతారా అనేది కాలమే నిర్ణయించాలి.

Tags
Devineni Avinash Vijayawada Politics YS Jagan Mohan Reddy YSRCP Andhra Pradesh AP Politics Vijayawada Mayor
Recent Comments
Leave a Comment

Related News