కూటమిలో సీట్ల పంచాయితీ క్లోజ్.. ఎవరికి ఎన్ని సీట్లంటే.?

admin
Published by Admin — October 15, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా స్థానిక సంస్థల ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య జరుగుతున్న సీట్ల సర్దుబాటు కసరత్తు తుది దశకు చేరుకుంది. కొద్దిరోజులుగా నడుస్తున్న సస్పెన్స్‌కు తెరదించుతూ, ప్రధాన కార్పొరేషన్లు, కీలక మున్సిపాలిటీలపై మూడు పార్టీల అధినాయకత్వం ఒక స్పష్టమైన అంగీకారానికి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) నివాసంలో జరిగిన అర్ధరాత్రి సుదీర్ఘ భేటీ ఈ చర్చలకు ఊపొచ్చినట్లు తెలుస్తోంది. జనసేన, బీజేపీ ముఖ్యనేతలు పాల్గొన్న ఈ సమావేశంలో స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా మథనం చేశారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా, పరస్పర అంగీకారంతో బరిలోకి దిగితేనే ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కొవచ్చనే ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు.

కార్పొరేషన్లపై పక్కా ప్లాన్.. ఎవరికి దక్కేదెవరికి?
రాష్ట్రంలోని మొత్తం 17 కార్పొరేషన్ల పంపకంపై కూటమి నేతలు ఒక ఫార్ములాను సిద్ధం చేసినట్లు సమాచారం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మెజారిటీ స్థానాలను టీడీపీ(TDP) తన ఖాతాలో వేసుకుంటుండగా, మిత్రపక్షాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.

అత్యధికంగా 12 కార్పొరేషన్లలో టీడీపీ బరిలోకి దిగే అవకాశం ఉంది. సింహభాగం స్థానాలను తనకే కేటాయించుకోవడం ద్వారా స్థానిక సంస్థల్లో పట్టు నిరూపించుకోవాలని వ్యూహం రచిస్తోంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలను మారుస్తున్న జనసేనకు 4 కార్పొరేషన్లు దక్కే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కాకినాడ, విజయవాడ, తిరుపతి, ఏలూరు వంటి హై-ప్రొఫైల్ కార్పొరేషన్లపై పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) పార్టీ గట్టి పట్టుపట్టినట్లు తెలుస్తోంది. మ‌రోవైపు కమల దళానికి ఒక కార్పొరేషన్‌ను కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా చారిత్రక నగరమైన రాజమండ్రి కార్పొరేషన్‌ను బీజేపీకి అప్పగించే యోచనలో కూటమి పెద్దలు ఉన్నట్లు సమాచారం.

మున్సిపాలిటీల్లోనూ లెక్కలు పక్కా!
కేవలం కార్పొరేషన్లే కాకుండా, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వారీగానూ సీట్ల షేరింగ్‌పై క్లారిటీ వచ్చేసింది. పిఠాపురం, పెద్దాపురం, భీమవరం, తెనాలి, నరసరావుపేట, మదనపల్లి వంటి పలు ప్రతిష్టాత్మక మున్సిపాలిటీలను జనసేన(Janasena)కు కేటాయించే చర్చలు తుది దశకు చేరాయి. అలాగే, బీజేపీ సైతం యలమంచిలి, బాపట్ల, శ్రీకాళహస్తి, గూడూరు వంటి ప్రాంతాల్లో తన అభ్యర్థులను బరిలోకి దించేలా ప్లాన్ చేసుకుంటోంది. స్థానిక బలాబలాలు, ఆయా ప్రాంతాల్లోని సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాల ఎంపికే ప్రాధాన్యం ఇస్తూ ఈ జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది.

కాగా, సీట్ల కేటాయింపులపై ఇప్పటివరకు అంతర్గతంగా సాగిన చర్చలకు నేడు తెరపడే అవకాశం ఉంది. మూడు పార్టీల అగ్రనేతలు ఉమ్మడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా పూర్తి వివరాలను ప్రకటించే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏదేమైనా, స్థానిక ఎన్నికల్లో(Ap Local Body Elections) ఎలాంటి రెబల్ బెడద లేకుండా, కూటమిగా ఐక్యంగా ముందుకు సాగాలని భావిస్తున్న ఈ త్రైసభ్య కూటమి వ్యూహం ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.

Tags
AP Local Body Elections AP Politics Chandrababu Naidu Pawan Kalyan AP NDA Alliance TDP JanaSena BJP
Recent Comments
Leave a Comment

Related News