ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు కొనసాగింపుగా.. తాజాగా జిల్లా పరిషత్ ఎన్నిలకలకు షెడ్యూల్ జారీ అయింది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఈ షెడ్యూల్ సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించారు. ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్రపునేఠా ఈ షెడ్యూల్‌ను స్వయంగా ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జిల్లా పరిషత్‌లు, 659 జడ్పీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) అమల్లోకి వచ్చింది. ఇక పై జిల్లాల్లోనూ కోడ్ అమల్లోకి వస్తుందని పునేఠా ప్రకటించారు. ఈ ఏడాది జనవరి నాటికి ఉన్న ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం.. ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. కొత్తగా ఓటుహక్కు పొందిన వారికి కూడా అవకాశం కల్పిస్తారు.
ఇదీ షెడ్యూల్
• ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 19
• పోలింగ్ తేదీ: నవంబర్ 3, 2026
• ఓట్ల లెక్కింపు, ఫలితాలు: నవంబర్ 5, 2026
• నామినేషన్లు.. అక్టోబరు 21 నుంచి 23వ తేదీ వరకు
ఇష్టాను సారం కుదరదు
జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేవారు ఇష్టానుసారం ఖర్చు చేసేందుకు కుదరదని పునేఠా వెల్లడించారు. ఎన్నికల ఖర్చుపై సీలింగ్ ఉంటుందని.. ప్రత్యేక ఆడిట్ కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు 8 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసుకుని ప్రచారం నిర్వహించుకునే అవకాశం ఉంటుందన్నారు. అలానే మండల పరిషత్‌లకు పోటీ చేసే అభ్యర్థులు 4 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంపీటీసీ ఎన్నికలకు 687 మంది అధికారులను, జిల్లా పరిషత్ స్థానాలకు 28 మందిని నియమించారు.