గత సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఓవైపు ముఖ్య నేతలంతా పార్టీకి గుడ్ బై చెప్పేస్తుంటే.. మరోవైపు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కూడా చేజారిపోతున్నాయి. తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. అది కూడా మాజీ వైసీపీ నేత కేశినేని నాని ఓటుతో.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా.. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ చెరో 14 స్థానాలను గెలుచుకున్నాయి. ఒక స్థానంలో శ్రీదేవి ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. ఆమె టీడీపీకి మద్దతు తెలపడంతో ఆ పార్టీ బలం 15 కు చేరింది. అదే సమయంలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన ఎక్స్ అఫిషియో ఓటును ఫ్యాను పార్టీకి వేశారు. దాంతో టీడీపీ, వైసీపీ బలం సమమైంది. ఇదే తరుణంలో అప్పటి ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తన ఎక్స్ అఫిషియో ఓటును ఉపయోగించుకున్నారు.
కానీ ఆయన ఓటు చల్లదంటూ వైసీపీ కోర్టుకు ఎక్కింది. వైసీపీ వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా తీర్పు వెల్లడించింది. 2021లో కేశినేని వినియోగించిన ఎక్స్ అఫిషియో ఓటు చెల్లుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు సీల్డ్ కవర్లో ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో టీడీపీ బలం 16 కు చేరింది. దీంతో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబు.. గతంలో ఇండిపెండెంట్‌గా గెలిచి టీడీపీకి మద్దతు పలికిన శ్రీదేవిని వైస్ ఛైర్ పర్సన్ గా అధిష్టానం నియమించింది. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.