పాత్రికేయుడికి సహజసిద్ధమైన అధికారాల కంటే కూడా బాధ్యతే ఎక్కువగా ఉంటాయి. జర్నలిస్టుగా చెప్పుకుంటున్నప్పుడు విషయం ఏదైనా..దానికి సంబంధించిన అంశాలపై స్పందించేటప్పుడు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలి. సమాజంలో ఎన్ని రంగాలు ఉన్నప్పటికీ.. పాత్రికేయ రంగానికి ఉండే ప్రత్యేక బాధ్యతను విస్మరించకూడదు. ఇవన్నీ చెబితే పాతచింతకాయ కబుర్లు వద్దన్న మాట అందరి నోటా వస్తుంది. దీనికి కారణం జర్నలిస్టు పేరుతో బోరు వేసే దగ్గర మొదలయ్యే దందా.. ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా ప్రతిచోటుకు విస్తరించటమే.
మారిన కాలానికి తగ్గట్లు.. పాత్రికేయంలో విలువలు సన్నగిల్లి చాలా కాలమే అయ్యింది. రాజకీయ పార్టీలకు గొంతుగా మారటం.. వారికి తగ్గట్లుగా వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు కనిపిస్తున్నదే. గతంలో జర్నలిస్టు అనే వాడికి కులం.. మతం.. ప్రాంతం.. రాజకీయ పార్టీ అనేది ఉండేది కాదు. జనహితమే తన హితంగా భావించేవాడు. డబ్బులకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టీవీ డిబేట్ లలో పాల్గొనే వేళలో ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుంది. ఒకవేళ నోరు జారితే వెంటనే ఆ మాటను వెనక్కి తీసుకొని భేషరతు క్షమాపణలు చెప్పటం ఉంటుంది.
అందుకు భిన్నంగా అమరావతి ప్రాంత మహిళలపై జర్నలిస్టుగా పేర్కొనే (?) కృష్ణంరాజు నోటి నుంచి వచ్చిన మాటలు.. చేసిన చేష్టలు విన్నంతనే ఇలా కూడా మాట్లాడతారా? అన్న సందేహం కలుగుతుంది. డిబేట్ వేళ నోటికి వచ్చి మాట్లాడిన ఆయన.. ఆ తర్వాత అయినా తన తప్పును తెలుసుకొని జాగ్రత్తగా మసులు కుంటే బాగుండేది.కానీ.. అదేమీ చేయకుండా వివరణ పేరుతో ఆయన మరింత అసహ్యంగా మాట్లాడటం.. అమరావతిప్రాంత మహిళ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలా చేసి.. తాను పరారీ అయిన సంగతి తెలిసిందే.