ఏపీలో గత ఎన్నికల సమయంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఫ్రీ బస్ స్కీమ్ ఒకటి. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూటమి పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇటీవలె ఏడాది పాలనను కూడా పూర్తి చేసుకుంది. కానీ ఇంతవరకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలు కాకపోవడం పట్ల ప్రతిపక్ష వైసీపీ ఘాటు విమర్శలు గుప్పిస్తోంది.
రాష్ట్ర మహిళలు కూడా ఈ పథకం ఎప్పుడెప్పుడు అమల్లోకి వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం పై క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయించింది. ఫైనల్ గా పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు సన్నద్దమవుతోంది. తాజాగా శ్రీశైలం పర్యటనలో భాగంగా సున్నిపెంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ వెల్లడించారు.
ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు స్కీమ్ ప్రారంభం కానుందని ప్రకటించారు. బట్ కండిషన్ అప్లై. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కేవలం జిల్లా పరిధికి మాత్రమే పరిమితం చేశారు. అంటే ఏ జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లా వరకే ఉచితంగా తిరిగే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఎక్కడ తిరగాలన్న ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్.. ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదని చంద్రబాబు వెల్లడించారు.