వేలాది కోట్ల రూపాయిలు చేతులు మారినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటూ.. సంచలన స్కాంగా మారిన ఏపీ మధ్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు జరిగిన పరిణామాలు ఒక ఎత్తు కాగా.. ఈ రోజు (శనివారం).. రేపు (ఆదివారం) రెండు రోజుల్లో మరిన్ని నాటకీయ పరిణామాలు ఎదురు కానున్నట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే.. ఆయన అరెస్టుకు సర్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో తనను పోలీసులు అరెస్టు చేయటానికి ముందే.. ఆయనే కోర్టు ఎదుట లొంగిపోతారన్న ప్రచారం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఎక్కడ? అన్నది ప్రశ్నగా మారింది. అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన హైదరాబాద్ లో ఉన్నట్లుగా తమకు తెలిసిందని చెప్పినా.. అందుకు భిన్నమైన ప్రాంతంలో ఉండే అవకాశం ఉందంటున్నారు. గడిచిన కొన్ని రోజులుగా అండర్ గ్రౌండ్ లో ఉంటున్న ఆయన్ను అరెస్టు చేయటానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది.
సుప్రీంకోర్టు.. ఏపీ హైకోర్టులలో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కొట్టేయటంతో ఆయన అరెస్టుకు వారెంట్ జారీ కోసం ఏసీబీ కోర్టులో మెమో వేశారు. అయితే.. దీన్నిఏపీ హైకోర్టు.. సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించిన పూర్తి వివరాల్ని అనుబంధంగా సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి వాపసు ఇవ్వటంతో.. అందుకు తగ్గ మార్పుల్ని ఆగమేఘాలపై సమర్పించారు.
మిథున్ రెడ్డి విదేశాలకు వెళ్లిపోకుండా ఉండేందుకు ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయటం తెలిసిందే. ఆయన ఎక్కడున్నా పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. తనను అరెస్టు చేసే అవకాశాన్ని సిట్ కు ఇవ్వకుండా తానే నేరుగా కోర్టు ముందు లొంగిపోతారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు మిథున్ రెడ్డి హైదరాబాద్ లో తలదాచుకుంటున్నారని..ఆయన ఆచూకీని గుర్తించినట్లుగా చెబుతున్నారు.
అంతేకాదు.. తెలంగాణ కు చెందిన ఒక ప్రముఖ రాజకీయ నేత ఆయనకు ఆశ్రయం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రాలేదు. మరోవైపు.. మిథున్ రెడ్డి హైదరాబాద్ లో ఉండే అవకాశం లేదని. ఆయన అక్కడ ఉంటే.. ఏపీ అధికారులు ఇట్టే పసిగడతారన్న ప్రచారం సాగుతోంది. దీంతో.. మిథున్ రెడ్డి ఎక్కడ? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.