ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ అడ్డాగా మారిపోయింది. పిఠాపురం నుంచి పవన్ తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో జనసేన తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ క్రమంలోనే అక్కడ వైసీపీ తరఫున వాయిస్ వినిపించేవారు కరువయ్యారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి పోటీగా వైసీపీ నుంచి వంగా గీత బరిలోకి దిగారు. కానీ పవన్ ముందు నిలబడలేకపోయాను. ఎన్నికల ఫలితాలు తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ కీలక నేత పెండెం దొరబాబు జనసేన కండువా కప్పుకున్నారు. దాంతో ఆ పార్టీకి మరింత బలం చేకూరింది.
అప్పటినుంచి వంగా గీత సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లోనూ తూ తూ మంత్రంగా పాల్గొంటున్నారు. ఇదే తరుణంలో వైసీపీ చూపు టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మపై పడింది. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వర్మ.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబుపై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ ఏడాది టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన ఆ పార్టీలోనే చేరారు.
2019 ఎన్నికల్లో మరోసారి పిఠాపురం నుంచి వర్మ పోటీ చేశారు. కానీ వైసీపీ వేవ్‌లో కొట్టుకుపోయారు. అయితే సుధీర్గ రాజకీయ ప్రస్థానంలో పిఠాపురం నియోజవర్గంపై మంచి పట్టు సాధించిన వర్మ.. గత ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీతో వర్మ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పైగా పవన్ గెలుపు తర్వాత వర్మకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్న వాదన ఉంది. ఇప్పటికే అక్కడ అంతర్గతంగా టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా పరిస్థితి మారింది. దీన్నే వైసీపీ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కొనసాగితే.. పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఛాన్స్ వర్మకు పవన్ ఇవ్వరు. ఈ నేపథ్యంలోనే వర్మను వైసీపీలో చేర్చుకోవాలని.. తద్వారా పార్టీకి బలమైన వాయిస్ దొరుకుతుందని అధిష్టానం భావిస్తోందట. అందులో భాగంగానే వైసీపీలో చేరితో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని.. వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీ అన్న సందేశాలు వర్మకు పంపుతున్నారట. ఇక ఒకవేళ వర్మ వైసీపీలో చేరితే.. వంగా గీత తన రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలోకి వెళ్లడం ఖాయమన్న టాక్ కూడా నడుస్తోంది. గీత గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పిఠాపురం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మెగా ఫ్యామిలీతోనే అమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. సో.. ఆమె జనసేన ఎంట్రీ అంత కష్టమేమి కాదనే చెప్పొచ్చు.