మద్యం కుంభకోణంలో ప్రజల రక్తాన్ని పీల్చి వేల కోట్లు సొమ్ము చేసుకున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్ కేసులో ఏ4 గా ఉన్న మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ కోర్ట్ ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అదే రోజు ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఎంపీగా ఉండడం, వై కేటగిరి భద్రత కలిగి ఉండడంతో జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలంటూ మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
అందులో అల్పాహారం సహా మూడు పూటల ఇంటి భోజనం, కిన్లే వాటర్ బాటిళ్లు, కొత్త పరుపుతో కూడిన బెడ్, కొత్త దిండ్లు, వెస్ట్రన్ కమోడ్ కలిగిన ప్రత్యేక రూమ్, అందులో టీవీ, యోగాసనాలు వేసుకోవడానికి యోగా మ్యాట్, వాకింగ్ షూస్, దోమ తెర, డైలీ న్యూస్ పేపర్స్, సేవలు అందించేందుకు ఓ సహాయకుడు కావాలని మిథున్ రెడ్డి కోరారు. వాటితో పాటుగా ప్రొటీన్ పౌడర్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, ముక్కులో వేసుకునే చుక్కల మందు, రూమ్‌లో ఒక కూర్చీ, టేబుల్ మరియు కొన్ని తెల్లకాగితాలు, పెన్ను ఇప్పించాలని కోరారు.
సోమవారం ఈ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. మిథున్ రెడ్డి కోరిక సౌకర్యాలను కల్పించే విషయంలో అభ్యంతరాలు ఉంటే చెప్పాలని రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ సూపరింటెండెన్‌ను న్యాయస్థానం ఆదేశించింది. మంగళవారం నేరుగా కోర్టుకు హాజరై అభ్యంతరాలు చెప్పాలని సూచించింది. అయితే జైలు అధికారులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటాయో లేవో కానీ.. జనాలు మాత్రం మిథున్‌రెడ్డి జైలుకెళ్లారా లేక అత్తారింటికి వెళ్లారా? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. అన్ని సౌకర్యాలు కల్పించి ఆయన్ను జైల్లో ఉంచే కన్నా ఓ లగ్జరీ హోటల్‌లో సూట్ రూమ్‌లో పెడితే బెటర్ అని వెటకారం చేస్తున్నారు.