వైసీపీ మహిళ నేత, మాజీ మంత్రి రోజా నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోజాకు గట్టి బుద్ధి చెప్పారు. బావిలో కప్ప అంటూ ఆమె పరువు తీసిపడేసారు. పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్తే ఆ ఊరు నాదే అని చెబుతుంటాడు అంటూ గతంలో రోజా ఘాటుగా అయన్ను విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విమర్శలకు తాజాగా పవన్ రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ నటించిన `హరిహర వీరమల్లు` చిత్రం నేడు విడుదలైన సంగతి తెలిసిందే.
అయితే ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం విశాఖపట్నంలో ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న నోవాటెల్ హోటల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అలాగే ఆయన స్పీచ్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అన్యాయం జరిగితే ప్రశ్నించడం, కష్టాల్లో ఉన్నవాడికి సాయం చేయాలనే తప్ప ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అయిపోవాలి, సినిమాల్లో నటించి కోట్లకు కోట్లు సంపాదించాలని తాను ఏనాడు అనుకోలేదని పవన్ పేర్కొన్నారు.
ఇదే వేదికపై పవన్ పరోక్షంగా రోజాకు కౌంటర్ కూడా ఇచ్చారు. `ఏ ఊరు వెళ్తే ఆ ఊరు నాదే అని చెబుతున్నానని విమర్శిస్తున్నారు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల తరచూగా ఆయనకు ట్రాన్షఫర్‌లు అయ్యేవి. దాంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మేము పెరిగాము. అందుకే అన్ని ఊర్ల పేర్లు చెబుతాను. నా పేరు పవనం.. తిరుగుతూ ఉంటాను. మనల్ని విమర్శించే వాళ్లు కూపస్థ మండూకాలు.. అంటే బావిలో కప్పలు. బావిలో ఒక గీరి గీసుకొని కూర్చొనే కప్పలకు ఏమీ తెలుస్తుంది పవనం తాలూకా శక్తి? ఎంత చెప్పినా అవి అర్థం చేసుకోలేవు` అంటూ పవన్ వ్యాఖ్యానించారు. రోజా పేరు ఎత్తకపోయినప్పటికీ పవన్ ఆమెను ఉద్ధేశించే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.