సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. నాలుగేళ్లుగా తాను తన సొంత ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నట్లు.. నరకాన్ని చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. తాజాగా ఆమె విడుదల చేసిన వీడియోలో తనకున్న ఆరోగ్య సమస్యతో పాటు.. తాను ఎదుర్కొంటున్ సమస్యల్ని ఏకరువు పెట్టి.. .భోరున విలపించారు. తనకు సాయం చేయాలని అర్ధించారు. ఇప్పటికే తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి పోలీసుల్ని ఆశ్రయించినట్లుగా పేర్కొన్నారు.
మీటూ వివాదంలో తాను ఓపెన్ అయినప్పటి నుంచి తనకు ఈ తరహా వేధింపులు మొదలైనట్లుగా పేర్కొన్నారు. తన ఇంట్లోకి చొరబాటుకు ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొన్న ఆమె.. తన ఆవేదనను పోలీసులకు చెబితే.. స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పారన్నారు. తనకు ప్రస్తుతం ఒంట్లో బాగోలేదని.. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత వెళతానని చెప్పారు.
గడిచిన నాలుగేళ్లుగా తనను చాలా వేధిస్తున్నట్లు చెప్పిన ఆమె.. ఈ కారణంగా తన ఆరోగ్యం దెబ్బ తిందన్నారు. ‘‘నేనేమీ చేయలేకపోతున్నా. నా ఇల్లు చాలా గందరగోళంగా ఉంది. నేను కనీసం పని మనుషుల్ని కూడా పెట్టుకోలేకపోతున్నా. గతంలో ఉన్న వారితో నాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. గతంలో ఉన్న వారితో నాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వారు నా ఇంట్లో చాలా వస్తువులను దొంగలించారు. అందుకే నా పనుల్ని నేనే చేసుకోవాల్సి వస్తోంది. సొంతింట్లోనే ఇబ్బంది పడుతున్నా. నాకు ఎవరైనా సాయం చేయండి.. ప్లీజ్’’ అంటూ వేడుకున్నారు.
ఈ వీడియోను పోస్టు చేసిన రోజు వ్యవధిలోనే మరో వీడియోను పోస్టు చేశారు. అందులో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. 2020 నుంచి ఇలాంటి పెద్ద పెద్ద సౌండ్లతో తాను ఇబ్బందులు పడుతున్నానని.. పైకప్పు.. తలుపు బయట నుంచి దాదాపు రోజూ ఇలా పెద్ద పెద్ద చప్పుళ్లతో అగచాట్లు పడుతున్నట్లుగా పేర్కొన్నారు. తాను నివాసం ఉండే బిల్డింగ్ మేనేజ్ మెంట్ వారికి కంప్లైంట్ చేసి విసిగిపోయానని.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదన్నారు.
తన ఆరోగ్యం అస్సలు బాగోలేదన్న తనుశ్రీ దత్తా.. తాను క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ తో బాధ పడుతున్నట్లు చెప్పారు. విపరీతమైన అలసటతో కూడకున్న వ్యాధిగా దీన్ని పేర్కొంటారు. ఐదేళ్ల నుంచి విపరీతమైన ఒత్తిడితో తానీ జబ్బున పడినట్లు పేర్కొన్నారు. తాను ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని పోలీసులకు ఇచ్చే కంప్లైంట్ లో పేర్కొంటానని ఆమె వెల్లడించారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు తనను వేధింపులకు గురి చేసినట్లుగా 2018లో తనుశ్రీ దత్తా ఆరోపణతోనే మీటూ ఉద్యమం మొదలైన విషయం తెలిసిందే. ఆమె నిర్మాత వివేక్ అగ్నిహోత్రిపైనా సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. చాక్ లెట్ మూవీ సెట్స్ లో ఇర్ఫాన్ తో కలిసి దుస్తులు లేకుండా డ్యాన్స్ చేయాలని కోరినట్లుగా వివేక్ మీద ఆమె ఆరోపణలు చేయటం..దాన్ని వివేక్ అగ్నిహోత్రి ఖండించటం తెలిసిందే. తాజాగా తను విపరీతమైన వేధింపులకు గురి అవుతున్నట్లుగా వీడియో పోస్టుతో మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు.