ఏపీ రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఏటా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద మూడు విడతల్లో అర్హులైన రైతులకు రూ. 6000 మొత్తాన్ని అందిస్తోంది. అయితే కేంద్రం అందించే రూ. 6 వేలతో పాటుగా రూ. 14 వేలు కలిపి రూ. 20,000 అన్నదాత సుఖీభవ పథకం కింద అందిస్తామని కూటమి సర్కార్ హామీ ఇచ్చింది. వాస్తవానికి గత నెలలోనే ఈ రెండు పథకాల తొలి విడత నిధులు విడుదల కావాల్సి ఉంది.
ఏపీలో కూటమి సర్కార్ ఇప్పటికే అర్హత కలిగిన రైతులను గుర్తించి జాబితాను ఖరారు చేసింది. పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ నగదును రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే సీఎం కిసాన్ నిధుల విడుదల జాప్యం జరగడంతో అన్నదాత సుఖీభవ కూడా ఆలస్యం అయింది. అయితే ప్రస్తుతం ఖరీఫ్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం సిద్ధమైంది.
ఆగస్టు 2న పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటన ఉంది. గతంలోనూ వారణాసి కేంద్రంగానే పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఇక తొలి విడతలో అర్హత పొందిన రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 5 వేలు మొత్తంగా రూ. 7 వేలు జమ కానున్నాయి. కాగా, వైసీపీ హయాంలో రైతు భరోసా పథకం కింద రూ. 7,500 మాత్రమే రైతులకు సాయం అందేది. అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరాక రాష్ట్ర వాటాగా అన్నదాలకు రూ. 14 వేలు అందించబోతుంది. సాగు పెట్టుబడులకు ఈ నగదు ఎంతగానో ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.