నారా వారి కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడా..? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నారా రోహిత్ పోటీ చేయబోతున్నారా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. టాలీవుడ్ హీరోగా నారా రోహిత్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడే. అయితే నిజానికి ఆయన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీ లోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు తమ్ముడు దివంగత రామ్మూర్తి నాయుడు కుమారుడే నారా రోహిత్.
పెదనాన్న చంద్రబాబు, అన్న లోకేష్ బాటలోనే నారా రోహిత్ కూడా రాజకీయాల్లోకి రావాలని ఉత్సాహంగా ఉన్నారు. అందలో భాగంగానే తిరుపతి జిల్లా చంద్రగిరి పై నారా రోహిత్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఆ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది. పాలిటిక్స్ లోకి వచ్చిన తొలినాళ్లలో చంద్రగిరి నుంచి చంద్రబాబు పోటీ చేశారు. 1994లో చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి గల్లా అరుణపై గెలుపొందారు.
1999 వరకు ప్రాతినిథ్యం వహించిన రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితుల కారణంగా మళ్లీ పోటీ చేయలేకపోయారు. ఆ తర్వాత మారిన సమీకరణల కారణంగా టీడీపీ పట్టుకోల్పోవడం.. కాంగ్రెస్, ఆపై వైసీపీకి చంద్రగిరి నియోజకవర్గం కంచుకోటగా మారడం జరిగిపోయాయి. అయితే 2024 ఎన్నికల్లో కూటమి వేవ్‌లో మళ్లీ చంద్రగిరిలో టీడీపీ గెలిచింది. ఇక రాబోయే ఎన్నికల్లో ఈ పట్టు నిలుపుకోవాలని.. అది తన కుటుంబ సభ్యులతోనే సాధ్యమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే నారా రోహిత్ ను రంగంలోకి దింపాలని బాబు ప్లాన్ చేస్తున్నట్టు ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా పావులు కూడా కదుపుతున్నారని సమాచారం.