ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నారి తన ముద్దు ముద్దు మాటలతో సోషల్ మీడియా వేదికగా ఎప్పుడో పాపులర్ అయ్యింది. అలాగే సమంత మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేసిన `శాకుంతలం` మూవీతో అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై కూడా అడుగు పెట్టింది. ఈ సినిమాలో ప్రిన్స్ భారతగా బన్నీ కూతురు అదరగొట్టింది.
ఇదిలా ఉంటే.. తాజాగా అర్హకు సంబంధించి మరొక క్యూట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్‌గా మంచు లక్ష్మి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అర్హ పాప మంచు లక్ష్మిని ఓ ఆటాడుకుంది. `నన్ను ఏదో అడగాలనుకుంటున్నావంట ఏంటది?` అని మంచు లక్ష్మి అడగ్గా.. అందుకు అర్హ నవ్వుకుంటూ `నువ్వు తెలుగేనా?` అని సూటిగా ప్రశ్నించింది.
అందుకు ఆశ్చర్యపోయిన మంచు లక్ష్మి.. `నేను తెలుగేనే పాప. నీకంత డౌట్ ఎలా వచ్చింది. నేను నీతో తెలుగులోనేగా మాట్లాడా` అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. ఇంతలో అల్లు అర్జున్ కలగజేసుకుని `నువ్వెందుకలా అడిగావ్` అని ప్రశ్నించగా.. అర్హ `నీ తెలుగు యాస అట్లా ఉంది` అని టీజ్ చేస్తూ నవ్వేసింది. `నీ యాస కూడా అలానే ఉంది కదా` అంటూ లక్ష్మి సైతం నవ్వులు చిందించింది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అర్హ అమాయకత్వం, క్యూట్‌నెస్ చూసి అల్లు ఫ్యాన్స్ మరియు నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు.