``జగన్ `వారసత్వం` కంపు కొడుతోంది`` అంటూ ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఎద్దవా చేశారు. ``వారసత్వం అంటే.. ఏమో అనుకునేరు. ఆయన ఏపీ ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి చెత్తను, అప్పులను వారసత్వంగా ఇచ్చి వెళ్లారు. అదే సంపదను ఇచ్చి వెళ్లి ఉంటే.. ప్రజలకు మరింత మేలు జరిగేది`` అని నారాయణ సెటైర్లు పేల్చారు. తాజాగా ఆయన కృష్నాజిల్లాలోని మచిలీపట్నంలో పర్యటిం చారు. ఇక్కడి డంప్ యార్డులో దాదాపు నాలుగేళ్లుగా పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల టన్నుల చెత్తను వైసీపీ ప్రభుత్వం వారసత్వ సంపదగా ఇచ్చిందని నారాయణ అన్నారు. పైగా అప్పట్లో చెత్తపై కూడా పన్నులు పిండారని, ఆ సొమ్ములు ఏం చేశారో కూడా లెక్క జమా లేదన్నారు. కానీ, ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోయిందని.. ఇప్పుడు దానిని తాము తొలగించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. త్వరలోనే చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అయితే.. అప్పటి వరకు చెత్త నుంచి వచ్చే దుర్వాసన భరించలేక పోతున్నామ ని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని అన్నారు.
``ఎవరైనా పాలకుడు చెత్తను దాచుకుంటాడా?. అది జగన్‌తోనే సాధ్యమైంది. ఆయనే చెత్తను దాచి పెట్టి వారసత్వంగా ఇచ్చారు. అప్పులు చేసి ప్రజలపై మోపారు.`` అని నారాయణ పదే పదే చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల టన్నుల చెత్తను శుభ్రం చేసినట్టు వివరించారు. దీని నుంచి విద్యుత్తు సమా.. ఇతర ఉత్పత్తులను తయారు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 7500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని మంత్రి వివరించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి.. చెత్త నుంచి ఆదాయం పొందే మార్గాలను అన్వేషిస్తున్నామని మంత్రి వివరించారు.