నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే కోట్ల రూపాయలిస్తామంటూ ఓ ఆడియో లీక్ అయిన సంగతి ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ మహిళా నేత ఒకరు రౌడీ షీటర్లతో సుపారీ డీల్ మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై కోటంరెడ్డి స్పందించారు. వైసీపీ నేతలు, రౌడీ షీటర్ల బుడ్డ బెదిరింపులను తానే కాదు..తన మనవడు, మనవరాలు కూడా లెక్కచేయరని అన్నారు.
ప్రతి మనిషి ఏదో ఒక రోజు చావాల్సిందేనని, చావుకు భయపడబోనని కోటంరెడ్డి అన్నారు. ప్రతి రోజూ భయపడి బ్రతికే అలవాటు తనకు లేదని చెప్పారు. బండికి కట్టి తీసుకువెళ్తా అంటూ బోరుగడ్డ అనిల్ బెదిరించిన రోజే తాను భయపడలేదని గుర్తు చేశారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే రౌడీ మూకలను తరిమికొట్టానని గుర్తు చేసుకున్నారు. 16 నెలల క్రితమే జగన్‌ను ధిక్కరించానని, ఆనాడు తనను, తన కుటుంబాన్ని బెదిరించినా భయపడలేదని అన్నారు.
ఇప్పుడు ఈ కుట్రలకు భయపడబోనని, తన కోసం నడిచే ప్రజల కోసం కొండలనైనా ఢీకొంటానని చెప్పారు.
ఈ వ్యవహారంపై వైసీపీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాజకీయాల కోసం సొంత కుటుంబ సభ్యులను చంపుకొనే చరిత్ర తమది కాదని పరోక్షంగా వివేకా హత్య కేసును ప్రస్తావించారు. అయితే, తనను చంపితే కోట్ల రూపాయలు ఇస్తానని రౌడీ షీటర్లకు చెప్పిందెవరో పోలీసులు తేల్చాలని అన్నారు.