కుప్పానికి తొలిసారిగా కృష్ణా జలాలు తెచ్చింది వైసీపీ అధినేత జగన్ అని వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ కంటే దాని కింద వచ్చిన కామెంట్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. జగన్ కు వ్యతిరేకంగా 90 శాతం కామెంట్లు ఉంటే...జగన్ కు మద్దతుగా కనీసం 10 శాతం కామెంట్లు కూడా లేవు. గత ప్రభుత్వంలో హంద్రీ-నీవా కాలువలో హడావుడిగా ట్యాంకర్లతో నీళ్లు నింపి..సినిమా సెట్ వేసి జగన్ బిల్డప్ ఇచ్చారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ విష ప్రచారంపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు.
గతంలో గేట్లతో సెట్టింగులు వేసి డ్రామాలాడడం చూశామని పరోక్షంగా జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అసత్యాలు చెప్పడంలో వైసీపీ దిట్ట అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కానీ, తమ ప్రభుత్వం అటువంటి ప్రచారం చేయదని చెప్పారు. మల్యాలలో మొదలైన కృష్ణా జలాలు పరమ సముద్రం వరకు వచ్చాయని అన్నారు. పరమసముద్రం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పానికి రెండేళ్లు ముందుగానే కృష్ణా పుష్కరాలు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు.
రాయల సీమను రతనాల సీమ చేస్తానని ముందే చెప్పానని, ఆ బాధ్యత తనదేనని మరోసారి నిరూపించానని చెప్పారు. ప్రతి చెరువుకూ నీరందిస్తామని హామీనిచ్చారు. 27 లిఫ్ట్ ఇరిగేషన్లతో నీళ్లు తరలిస్తున్నామని తెలిపారు.