గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా రవికి నంద్యాలలో బహిరంగంగా మద్దతు ఇవ్వడం ఎంత పెద్ద వివాదమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పరిణామంతో మెగా ఫాన్స్ మరియు జనసైనికుల్లో అల్లు అర్జున్ పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అప్పటినుంచి ఛాన్స్ దొరికినప్పుడల్లా మెగా ఫ్యాన్స్ బన్నీని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు బన్నీ థ్యాంక్స్ చెప్పడంతో నెట్టింట మరో కొత్త రచ్చ స్టార్ట్ అయింది.
దివంగత ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ ఆగస్ట్ 30న కన్నుమూసిన సంగతి తెలిసిందే. వయోవృద్ధతకు సంబంధించిన ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె మరణించారు. హైదరాబాదు కోకాపేట్‌లోని అల్లు అరవింద్ వ్యవసాయ క్షేత్రంలో కనకరత్నమ్మ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల చిత్ర పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా అల్లు కుటుంబానికి సానుభూతి తెలిపారు. వైఎస్ జగన్ కూడా `దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య గారి సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.` అంటూ పోస్ట్ పెట్టారు.
అయితే జగన్ సంతాప ప్రకటనపై అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యాడు. `జగన్ గారు, మీ సంతాపానికి చాలా ధన్యవాదాలు. మీ దయగల మాటలు మరియు మద్దతుకు మేము నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము` అని బన్నీ రిప్లై ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ మరోసారి బన్నీని ఏకేస్తున్నారు. ఇంత దూలోడివేంట్రా బాబు అంటూ ఫైర్ అవుతున్నారు. మరోవైపు బన్నీ ఫ్యాన్స్ మాత్రం థ్యాంక్స్ చెప్పడంతో తప్పేముందని సమర్థిస్తున్నారు.