భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసింది. కొద్దిసేపటి క్రితమే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. `పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు శ్రీమతి కె. కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.` అని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా అనౌన్స్ చేసింది.
ఈ పరిణామంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల నుంచి పార్టీ అధిష్టానంకు, కవితకు మధ్య గ్యాప్ మొదలైంది. తాజాగా పార్టీకి పిల్లర్స్ లాంటి హరీశ్ రావు, సంతోష్ రావులను ఉద్దేశించి కవిత చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. కాళేశ్వరంలో కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి హరీశ్ రావు, సంతోష్ రావులే కారణమంటూ కవిత ఆరోపించడం పెద్ద చర్చనీయాంశమైంది.
కవిత ప్రెస్‌మీట్ అనంతరం పార్టీలోని ముఖ్య నేతలో కేసీఆర్ అత్యవసరంగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో మెజారిటీ నేతలు పార్టీ నుంచి కవితను తక్షణం సస్పెండ్ చేయాలని.. లేదంటే మరింత నష్టం కలుగుతుందని సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలతో కవితపై కేసీఆర్ వేటు వేయడం ఖాయమనే వార్తలు ఊపందుకున్నాయి. మరోవైపు కవితను బహిష్కరిస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అంతటి కఠిన నిర్ణయం కేసీఆర్ తీసుకోరు అన్న వాదన కూడా బలంగా వినిపించింది.
అయితే ఫైనల్ గా కేసీఆర్ కూతురికి బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీలోని ముఖ్యనేతలు, జిల్లా, మండల స్థాయిలోని నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న ఆయన కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ షాకింగ్ ఘటనతో బీఆర్ఎస్, తెలంగాణ రాజకీయాల్లో జరిగే మార్పులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.