కేరళలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఉదయం శబరిమల అయ్యప్పస్వామి ఆలయా న్ని దర్శించారు. అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత తిరువనంతపురంలోని రాజ్‌భవన్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రమదం ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో పంబ వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించి అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్ళారు.
ఆలయం వద్ద ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు చైర్మన్ సహా సభ్యులు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అయ్యప్పస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే.. దీనికి ముందు రాష్ట్రపతి పర్యటించిన హెలికాప్టర్ కు పెను ప్రమాదం తప్పింది.
తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రమదం ప్రాంతానికి చేరుకున్న హెలికాప్టర్ అనూహ్యం గా భూమిలో కూరుకుపోయింది. అప్పటికి రాష్ట్రపతి హెలికాప్టర్‌లోనే ఉన్నారు. ఆమె మరికొన్ని క్షణాల్లో హెలికాప్టర్ నుంచి దిగాల్సి ఉండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
అనంతరం.. రాష్ట్రపతిని సురక్షితంగా కిందికి దింపిన అధికారులు.. ఆమెను రోడ్డు మార్గంలో పంబకు పంపించారు. అనంతరం మట్టిలో కూరుకుపోయిన హెలికాప్టర్ చక్రాన్ని బయటకు తీసేందుకు పలువురు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హెలకాప్టర్‌ను ముందుకు నెట్టారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.