తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అంటే చంద్రబాబు నాయుడు ఎంత కట్టుదిట్టంగా వ్యవహరిస్తారో అందరికీ తెలుసు. పార్టీ ప్రతిష్ట, శాసనబద్ధతపై ఎప్పుడూ కాంప్రమైజ్ కాని చంద్రబాబు అదే ధోరణి ప్రదర్శించారు. తన స్వంత పార్టీలో రాజుకున్న అంతర్గత వివాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య మొదలైన చిన్నపాటి అసంతృప్తి ఇప్పుడు పార్టీ ఇమేజ్‌పై మచ్చ వేసే స్థాయికి చేరింది. సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ పరస్పరం దాడులు చేసుకోవడం, ఆరోపణలు చేయడం అటు టీడీపీ లోనూ, ఇటు బయట పెద్ద చర్చగా మారింది.
స్థానిక సమస్యలతో మొదలైన ఈ విభేదం, ఇప్పుడు వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లిపోయింది. కొలికపూడి చేసిన సంచలన ఆరోపణలతో వివాదం మరింత వేడెక్కింది. ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు అడిగారంటూ కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. ఆ మేరకు బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టి, నిరూపణతోనే మాట్లాడుతున్నా అని చెప్పడం తీవ్ర కలకం రేపింది. మరోవైపు కేశినేని చిన్ని కూడా వెనుకడుగు వేయలేదు. ``నిన్నటివరకు నన్ను దేవుడు అన్న కొలికపూడికి ఇప్పుడు నేను దెయ్యమా?`` అని ఘాటుగా కౌంటర్ ఇచ్చి ఆన్‌లైన్ వార్‌ను మరింత పెంచేశారు.
దుబాయ్ నుంచే బాబు ‘కనెక్ట్’
అయితే పార్టీ అంతర్గత సమస్యలు ఇలా బహిరంగంగా బయటకు రావడం చంద్రబాబుకు అస్సలు నచ్చలేదు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు, ఈ వివాదంపై వెంటనే స్పందించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడి, పరిస్థితిపై పూర్తి నివేదిక అడిగారు. ఇద్దరినీ పిలిచి సర్దిచెబుతానన్న పల్లా ప్రతిపాదనను బాబు సూటిగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. యూఏఈ నుంచి రాగానే నేనే మాట్లాడతా... క్రమశిక్షణ విషయాల్లో ఎలాంటి రాజీ ఉండదని బాబు స్పష్టం చేసినట్టు సమాచారం. అభిప్రాయభేదాలు ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించుకోవాలి తప్ప, ఇలా బహిరంగంగా రచ్చ చేసి పార్టీకి నష్టం కలిగించడం సరికాదని బాబు హితవు పలికారు. పార్టీలో ఎవరు ఎంత పెద్ద నేతలైనా సరే, క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, కేశినేని చిన్ని, కొలికపూడి వివాదం పార్టీ అంతర్గత వ్యవస్థలో చర్చనీయాంశమైంది. బాబు యూఏఈ పర్యటన ముగించుకొని రాగానే ఈ ఇద్దరు నేతలపై క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ పరువు దెబ్బతిన్నందున ఈసారి చంద్రబాబు చేతుల్లో ఆ ఇద్దరు నేతలకు మూడినట్లే అని పార్టీలు శ్రేణులు చర్చించుకుంటున్నారు.