త్వరలో ఇంగ్లండ్ తో జరగబోతోన్న టెస్ట్ సిరీస్ కెప్టెన్సీ నుంచి టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను తప్పించబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆస్ట్రేలియాతో గత ఏడాది డిసెంబరులో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ శర్మను తప్పుకోవాలని సూచించడం అప్పట్లో సంచలనం రేపింది. అదే మాదిరిగా ఇప్పుడు ఇంగ్లండ్ టూర్ లో కేవలం ప్లేయర్ గా మాత్రమే హిట్ మ్యాట్ వెళ్లాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు రోహిత్ శర్మ సంచలన ప్రకటన చేశారు.
త్వరలో ఇంగ్లాండ్ తో జరగబోతున్న టెస్ట్ సిరీస్ కు ముందు రోహిత్ శర్మ రిటైర్ కావడంతో ఆయన అభిమానులు షాకయ్యారు. అంతేకాకుండా, ఇలా హఠాత్తుగా రిటైర్ కావడం, వీడ్కోలు మ్యాచ్ లేకపోవడం వంటివి కూడా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేశాయి. అయితే, కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని రోహిత్ ను సెలక్టర్లు కోరడంతోనే ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
అదీగాక, కొంతకాలంగా టెస్ట్ క్రికెట్ లో హిట్ మ్యాన్ పేలవమైన ఫామ్ తో సతమతమవుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో 3 మ్యాచ్ లు ఆడిన హిట్ మ్యాన్ 31 పరుగులు మాత్రమే చేశాడు. అవమానకర రీతిలో రోహిత్ చివరి మ్యాచ్ నుంచి తప్పుకొని బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక, తాజాగా ఇంగ్లండ్ సిరీస్ కు ముందు కూడా కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నారని ప్రచారం జరగడంతో రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు 67 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన రోహిత్ శర్మ 40.57 యావరేజ్ తో 4031 పరుగులు చేశాడు. అందులో 12 శతకాలు, 18 అర్ధ శతకాలు ఉన్నారు. అంతర్జాతీయ టి20 క్రికెట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడాలన్న ఉద్దేశంతో హిట్ మ్యాన్ ఉన్నారని తెలుస్తోంది.