2019-2024 మధ్య టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో...2024 ఎన్నికల సమయంలో...టీడీపీకి ఎన్నారైలు ఎంతో అండగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి గెలుపులో ఎన్నారైలు తమ వంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే అమెరికాలోని ఎన్నారైలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపేందుకు మంత్రి నారా లోకేశ్ డాలస్ వెళ్లారు. అక్కడ తెలుగు డయాస్పొరాతో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని లోకేశ్ అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీతోపాటు తమ కుటుంబానికి ఎన్నారైలు కొండంత బలం ఇచ్చారని ప్రశంసించారు. తాను అమెరికాలో సుమారు తొమ్మిదేళ్లు ఉన్నానని, ఏనాడూ జరగని ఓ ఘటన ఈ రోజు జరిగిందని చెప్పారు. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుంటే ఆరుగురు పోలీసులు అడ్డుకున్నారని, బయట చాలా రద్దీగా ఉందని, వెళ్లేందుకు పర్మిషన్ లేదని తనకు చెప్పారని అన్నారు. డల్లాస్ ఎయిర్ పోర్ట్ దగ్గర నుంచి సమావేశ స్థలం వరకు తనకు ఘనస్వాగతం పలికిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
తాను అమెరికాలో ఉన్నానా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అనే అనుమానం వచ్చిందని లోకేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రవాసాంధ్రుల ఉత్సాహం, జోష్ చూస్తుంటే.. యువగళం పాదయాత్ర రోజులు గుర్తుకువస్తున్నాయన్నారు. ఆనాటి పాలకులు తనను అడ్డుకున్నా తగ్గేదే లేదని ఆనాడు చెప్పినట్లు ఈనాడూ చెప్పారని తెలిపారు. ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబును 53 రోజులు అక్రమంగా జైల్లో పెట్టినప్పుడడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు భారీ స్థాయిలో ఆయనకు మద్దతుగా నిలిచారని, డాలస్ లో మూడు కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం ఇచ్చారని, ఆ రోజు ఎన్నారైలు అండగా నిలవడం వల్లే ఈ రోజు ఈ వేదికపై ఇలా నిలుచొని మాట్లాడగలుగుతున్నానని భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రవాసాంధ్ర వ్యవహారాల సలహాదారు, ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ అధ్యక్షులు వేమూరు రవికుమార్, ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ కోమటి జయరాం, టెక్సాస్ లోని గార్లాండ్ నగర మేయర్ డైలాన్ హెడ్రిక్, డల్లాస్ టీడీపీ నాయకులు, భారీ సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.