ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనంటూ వైసీపీ అధినేత జగన్ తో పాటు వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని బెదిరిస్తూ జగన్ లేఖ కూడా రాశారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆ లేఖను సభలో అయ్యన్న చదివి వినిపించారు. ఈ సందర్భంగా అయ్యన్న కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడు వైసీపీకి ప్రతిపక్ష హోదా అనే వరం ఇవ్వలేదని, పూజారి నుంచి ఆ వరం ఆశించడం తప్పు అని అన్నారు.
ఆ లేఖలో బెదిరింపులు, అభియోగాలు ఉన్నాయని అయ్యన్న వెల్లడించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందని అసంబద్ధ వాదన చేస్తున్నారు. హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్ కు విచారణార్హత ఉందో లేదో ఇంకా తేలలేదని అన్నారు. కానీ, అసెంబ్లీ స్పీకర్ కు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శికి కోర్టు నోటీసులిచ్చిందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉంది కాబట్టి తాను ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్నానని చెప్పారు. కానీ, ఇటీవల ప్రతిపక్ష హోదాపై వైసీపీ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని, తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిసిందని అన్నారు. స్పీకర్ కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. కనీసం 10 శాతం సభ్యులుంటే సభలో ప్రతిపక్ష హోదా వస్తుందని జగన్ గతంలో ఇదే సభలో వ్యాఖ్యలు చేశారని అయ్యన్న గుర్తు చేశారు.
అయినా సరే, జగన్ ప్రేలాపనలను సభాపతి హోదాలో క్షమించి వదిలేస్తున్నానని చెప్పారు. కానీ, వైసీపీ సభ్యుల తప్పుడు ప్రచారానికి తెర దించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించానని అన్నారు. జగన్ తోపాటు మిగతా వైసీపీ సభ్యులు కూడా సభకు రావడం లేదని, వారి నియోజకవర్గ సమస్యలు సభలో ఎవరు లేవనెత్తుతారని ప్రశ్నించారు. ఇకనైనా వైసీపీ సభ్యులు సభకు రావాలని కోరారు.