ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టే లక్ష్యంగా ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వ ప్రయత్నాలకు వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. లక్షకు పైగా ఉద్యోగాలు తీసుకొచ్చే ప్రతిష్ఠాత్మక ఐటీ ప్రాజెక్టులపై పిల్స్ వేస్తూ రాష్ట్ర భవిష్యత్తుతో వైసీపీ ఆటలాడుతోందని ఆయన ఆరోపించారు.
టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ, రహేజా ఐటీ పార్కుల వంటి కీలక ప్రాజెక్టులు ఏపీలో అడుగుపెట్టే దశలో ఉండగానే, వాటిని లక్ష్యంగా చేసుకుని కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం వెనుక వైసీపీ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని లోకేశ్ అన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ కార్యరూపం దాల్చితే రాష్ట్ర యువతకు సుమారు లక్షకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేశారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి లోకేశ్ ఘాటు విమర్శలు చేశారు. “వైఎస్ జగన్ గారూ… మా యువత భవిష్యత్తుపై మీకెందుకింత ద్వేషం? ప్రతి అవకాశాన్ని అడ్డుకుంటూ ఏపీని ఎందుకు ఇలా దెబ్బతీస్తున్నారు?” అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒకవైపు ప్రభుత్వం పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు రాజకీయ స్వార్థం కోసం వైసీపీ ప్రాజెక్టులను అడ్డుకోవడం దుర్మార్గమని లోకేశ్ విమర్శించారు.
అభివృద్ధి ఆగిపోతే నష్టపోయేది యువతే తప్ప ప్రభుత్వం కాదని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమలు వస్తే ఉపాధి పెరుగుతుందన్న సత్యాన్ని వైసీపీ కావాలనే విస్మరిస్తోందని, ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయడంలో పైశాచిక ఆనందం పొందుతోందని లోకేశ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని వెనక్కి లాగాలనే ఆలోచనలతో యువత ఆశలను చిదిమేయడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా లోకేశ్ హెచ్చరించారు.