తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పేరు వినగానే రాజకీయాల కంటే ముందు విద్యాసంస్థల సామ్రాజ్యం గుర్తొస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా డీమ్డ్ యూనివర్సిటీలు, మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలను విజయవంతంగా నడుపుతున్న మల్లారెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్ పెంచారు. ఈ క్రమంలోనే ఆయన విజయనగరం జిల్లా బొబ్బిలి పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
చారిత్రక బొబ్బిలి కోటను సందర్శించిన మల్లారెడ్డి, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బేబినాయనతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కోటలోని మ్యూజియంను ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించిన ఆయన, బొబ్బిలి రాజుల వంశవృక్షం, రెండు శతాబ్దాల నాటి ఆయుధాలు, వినియోగ వస్తువులను ఆసక్తిగా చూశారు. ముఖ్యంగా తాండ్రపాపారాయుడు ఉపయోగించిన కత్తిని చేతబట్టి ఫొటోలకు ఫోజులివ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సందర్భంగా బొబ్బిలి రాజుల చరిత్ర ఎంతో గొప్పదని, చారిత్రక వారసత్వాన్ని ఇంత జాగ్రత్తగా భద్రపరచడం అభినందనీయమని మల్లారెడ్డి కొనియాడారు. కోట విశేషాలను వివరించిన ఎమ్మెల్యే బేబినాయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపారు. అయితే ఇది కేవలం చరిత్ర దర్శన పర్యటన మాత్రమే కాదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బొబ్బిలిలోని ఓ ప్రముఖ విద్యాసంస్థ ప్రాంగణంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న స్థానిక యాజమాన్యం విజ్ఞప్తి మేరకే మల్లారెడ్డి ఈ ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే హైదరాబాద్‌లో విద్యా రంగంలో పెద్ద స్థాయి పెట్టుబడులు పెట్టిన ఆయన, ఏపీలోనూ తన విద్యా సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే విశాఖపట్నం, తిరుపతిలో కొన్ని కాలేజీలను కొనుగోలు చేసిన విషయాన్ని మల్లారెడ్డే స్వయంగా వెల్లడించడం ఈ ఊహలకు బలం చేకూరుస్తోంది. ఉత్తరాంధ్రలో యూనివర్సిటీ ఏర్పాటు జరిగితే, విద్యార్థులకు కొత్త అవకాశాలు రావడంతో పాటు ప్రాంత అభివృద్ధికి కూడా దోహదపడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.