బంగ్లాలో అల్ల‌ర్లు.. హిందువుల ఊచకోతపై నోరు మెదప‌రేం..?

admin
Published by Admin — December 20, 2025 in Politics, National
News Image

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు యావత్ భారతదేశాన్ని కలచివేస్తున్నాయి. అక్కడ హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు, దేవాలయాల ధ్వంసం, ఇళ్లకు నిప్పంటించడం వంటి ఘటనలు రోజురోజుకు తీవ్రమవుతున్న వేళ… భారత రాజకీయ వర్గాల్లో మాత్రం ఆశ్చర్యకరమైన మౌనం నెలకొంది. ఈ పరిస్థితిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసను నేరుగా  నరమేధంగా అభివర్ణించారు. ఇంత అమానుష ఘటనలు జరుగుతున్నా, వాటిని ఖండించకుండా మౌనంగా ఉండిపోయిన రాజకీయ పార్టీలు, నేతలపై ఆయన ఘాటు ప్రశ్నలు సంధించారు. “ఇలాంటి దాడులపై నోరు మెదపని వారు నిజంగా భారతీయులేనా?” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మతం పేరుతో సాగుతున్న ఈ హింస కేవలం ఒక దేశానికి సంబంధించిన అంశం కాదని, ఇది అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. భారతదేశం అనేది సహనానికి, మత సామరస్యానికి ప్రతీక అని గుర్తుచేశారు. అలాంటి దేశంలో ఉంటూ, హిందువులపై జరుగుతున్న దాడులపై స్పందించకపోవడం దేశభక్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. అక్క‌డితో ఆగ‌ని విజయసాయిరెడ్డి, బాధితుల పక్షాన నిలబడకుండా మౌనం పాటించడం అనైతికమని, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచినట్టేనని అన్నారు.

“ఈ దాడులను ఖండించలేని వారికి ఈ దేశంలో నైతిక హక్కు ఉందా? అలాంటి వారిని మనమే దేశం నుంచి బహిష్కరిద్దాం” అంటూ పిలుపునిచ్చారు. అంతేకాదు, బంగ్లాదేశ్ హింసాకాండపై భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని, అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత హిందువులకు అండగా నిలవడమే కాకుండా, మానవ హక్కుల పరిరక్షణలో భారత్ తన పాత్రను చాటాలని సూచించారు.

Tags
Vijay Sai Reddy Hindu Killings Bangladesh Bangladesh Riots
Recent Comments
Leave a Comment

Related News