మద్యపాన నిషేధం అంటూ ఊదరగొట్టి సీఎం అయిన జగన్...ఆ తర్వాత నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన వైనంపై టీడీపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ మార్కెట్లోకి వదిలిన జే బ్రాండ్ చీప్ లిక్కర్ తో చాలామంది జనం అనారోగ్యం పాలయ్యారని టీడీపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలను నిజం చేస్తూ తాజాగా సంచలన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. 2019-2024 మధ్యకాలంలో మద్యపాన సంబంధిత కాలేయ వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య 2014-2019 మధ్యకాలంతో పోలిస్తే రెట్టింపయిందని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది.
ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదైన గణాంకాలను విశ్లేషించిన కమిటీ ఈ వివరాలను వెల్లడించింది. కాలేయ వ్యాధులతో పాటు నరాల సంబంధిత సమస్యలు కూడా 2019-24 మధ్యకాలంలో గణనీయంగా పెరిగాయని తమ నివేదికలో పేర్కొంది. 2014-19 మధ్య కాలంలో 14,026గా ఉన్న ఆ కేసులు, 2019-24 నాటికి 29,369కి చేరాయని, ఏకంగా 100 శాతం పెరిగాయని నివేదికలో తెలిపింది.
ఆ సమయంలోనే మద్యపానం వల్ల వచ్చే నరాల సంబంధిత రుగ్మతల కేసులు కూడా ఆందోళనకర స్థాయిలో పెరిగాయని తెలిపింది. 2014-19 మధ్య 1,276గా ఉన్న ఆ సంఖ్య 2019-24 నాటికి 12,663కు చేరిందని, 892 శాతం పెరుగుదల ఉందని ఆ నివేదికలో పేర్కొంది. కాలేయం, కిడ్నీ, మానసిక ఆరోగ్యం, నరాల వ్యాధులు అనే నాలుగు విభాగాల్లో అసాధారణ పెరుగుదల ఉందని కమిటీ గుర్తించింది. ఈ నివేదికలోని అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేసి, నివారణ చర్యలను సిఫార్సు చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ఒక సలహా మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది