గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకుని అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీలో జంపింగ్‌ల పర్వం ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఒకరి తర్వాత ఒకరిగా నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతుండటంతో… తాజాగా మరికొందరు కీలక నేతలపై కూడా సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీకి గుడ్‌బై చెప్పి జనసేన లేదా బీజేపీలో చేరే ఆలోచనలో ఆమె ఉన్నారని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ వార్తలపై తాజాగా బుట్టా రేణుక క్లారిటీ ఇచ్చారు. ``ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం… రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకే ఇలాంటి ఫేక్ న్యూస్ పుట్టిస్తున్నారు`` అంటూ ఆమె మండిపడ్డారు. ప్రజల్లో తనకు ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకే కావాలనే తన పేరును లాగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ``జగన్‌ను వదిలి వెళ్లాల్సి వస్తే… అదే నా రాజకీయ జీవితానికి చివరి రోజు`` అంటూ బుట్టా రేణుక బిగ్ స్టేట్‌మెంట్ పాస్ చేశారు.
2019లో మళ్లీ వైసీపీలో చేరిన తర్వాత ఎలాంటి పదవులు, లాభాపేక్షలు లేకుండా పార్టీ కోసం పనిచేశానని ఆమె గుర్తు చేశారు. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ బలోపేతమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంపై తనకు అపారమైన విశ్వాసం ఉందని చెప్పారు. తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నవారే రేపు ప్రజల ముందు నవ్వులపాలవుతారంటూ బుట్టా రేణుక చేసిన హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికి వైసీపీకి వరుస షాక్‌ల మధ్య మరో పెద్ద దెబ్బ పడుతుందన్న ప్రచారానికి బుట్టా రేణుక చెక్ పెట్టడం పార్టీ శ్రేణులకు కాస్త ఊరట కలిగించే అంశం.