ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ..ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ చేసిన కామెంట్లు పొలిటికల్ కాక రేపాయి. జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాంటూ పవన్ ను జగన్ ఎద్దేవా చేయడంపై ఇటు జనసే, అటు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై మంత్రి లోకేశ్ ఫైర్ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ ను కించపరిచేలా జగన్ మాట్లాడారని లోకేశ్ నిప్పులు చెరిగారు.
అహంకారానికి షర్టు, ప్యాంటు వేస్తే జగన్‌లా ఉంటుందని లోకేశ్ విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారి ఆలోచించాలని, పవన్ కు వచ్చిన మెజారిటీ జగన్ కు వచ్చిన మెజారిటీ, జనసేనకు వచ్చిన సీట్లు, వైసీపీకి వచ్చిన సీట్లు ఎన్ని అనేది జగన్ ఒక్కసారి ఆలోచన చేయాలని చూసుకోవాలని హితవు పలికారు. నోరుంది గనుక తాను అనుకున్నదే కరెక్ట్, అధికారంలో ఉన్నవారిని కించపరిచేలా మాట్లాడతాను అనడం సరికాదని సూచించారు.
జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించారని, ఆ విషయం జగన్‌కు ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. ఇకపై, సీఎం, డిప్యూటీ సీఎంను కించపరిచేలా మాట్లాడితే సహించబోమని, ఏదిపడితే అది వాగితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజలకు జగన్ దూరంగానే ఉన్నారని, పరదాల ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో పరదాల అమ్మకాలు తగ్గాయని సెటైర్లు వేశారు. 11 సీట్లు ఎందుకు వచ్చాయన్న విషయంపై జగన్ ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని, తన తప్పుల గురించి కార్యకర్తల దగ్గరకు వెళ్లి అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్ తల్లి, చెల్లి కూడా ఆయనను నమ్మడం లేదని అన్నారు. చట్టాల్ని ఉల్లంఘించిన ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ను గుర్తించలేమన్నారు. జగన్‌కు అధికారం వస్తే సీబీఐని మూసేస్తారని లోకేశ్ ఆరోపించారు.