2025వ సంవత్సరం టాలీవుడ్‌కు ఒక విభిన్నమైన అనుభవాన్ని మిగిల్చింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఒక ఎత్తు అయితే, ఇండస్ట్రీని కుదిపేసిన వివాదాలు మరో ఎత్తు. పవన్ కళ్యాణ్ నుంచి శివాజీ వరకు, అగ్రహీరోల సినిమాల నుంచి సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల వరకు.. ఈ ఏడాది బాక్సాఫీస్ హిట్స్ కంటే ఇప్పుడు చెప్పబోయే 6 వివాదాలే ఎక్కువ హైలెట్ అయ్యాయి.
శివాజీ నోటి దురుసు వ్యాఖ్యల దుమారం
2025 చివరలో అత్యంత హాట్ టాపిక్ అయిన వివాదం నటుడు శివాజీ వ్యాఖ్యలు. `దండోరా` సినిమా ప్రమోషన్లలో మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ``సామాన్లు``, ``దరిద్రపు ముం*`` వంటి పదజాలం వాడటంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వివాదం చివరకు తెలంగాణ మహిళా కమిషన్ వరకు వెళ్ళింది. ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ, పరిస్థితి ఇంకా చల్లారలేదు.
`గేమ్ ఛేంజర్`పై నిర్మాత శిరీష్ వ్యాఖ్యలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా `గేమ్ ఛేంజర్` బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో నిర్మాతల్లో ఒకరైన శిరీష్ చేసిన వ్యాఖ్యలు చిచ్చు పెట్టాయి. ``సినిమా ఫ్లాప్ అయ్యాక చరణ్ గానీ, శంకర్ గానీ మాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు`` అని ఆయన అనడం మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా సోషల్ మీడియాలో `బోయ్‌కాట్ దిల్‌రాజు ప్రొడక్షన్స్` హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి. పరిస్థితి చేయి దాటుతుండటంతో శిరీష్ బహిరంగ క్షమాపణలు చెప్పి, అది మిస్ అండర్ స్టాండింగ్ అని సర్దిచెప్పారు.
రాజేంద్ర ప్రసాద్ - డేవిడ్ వార్నర్ ఇష్యూ
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ ఏడాది వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. `రాబిన్ హుడ్` ఈవెంట్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి ``క్రికెట్ ఆడటం మానేసి డాన్సులే చేస్తున్నాడు`` అంటూ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లకు నచ్చలేదు. ఒక అంతర్జాతీయ స్టార్‌ను అవమానించారనే విమర్శలు రావడంతో, ఆయన ఒక వీడియో సందేశం ద్వారా వార్నర్‌కు సారీ చెప్పారు. అయితే ఆ తర్వాత అలీపై కూడా ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.
`ఆ నలుగురు` వర్సెస్ పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ `హరిహర వీరమల్లు` విడుదల వాయిదాలు పడటం వెనుక టాలీవుడ్‌లోని `ఆ నలుగురు` పెద్దలు ఉన్నారనే ప్రచారం ఈ ఏడాది తీవ్రమైంది. థియేటర్లు ఇవ్వకుండా పవన్ సినిమాను అడ్డుకుంటున్నారనే వాదనలు ఏపీ రాజకీయాల్లో కూడా వేడి పుట్టించాయి. దాంతో దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి అగ్ర నిర్మాతలు ప్రెస్ మీట్లు పెట్టి మరి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. చివరికి పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి, ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ వివాదాన్ని చల్లార్చారు.
మంచు ఫ్యామిలీ రియాలిటీ డ్రామా
2025లో మంచు కుటుంబ కలహాలు టాలీవుడ్‌లో పెను సంచలనం సృష్టించాయి. ఆస్తి వివాదాలు, వ్యక్తిగత దాడుల ఆరోపణలతో మనోజ్ తన తండ్రి మోహన్ బాబు, సోదరుడు విష్ణులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విష్ణు తన కారును దొంగిలించాడని మనోజ్, `కన్నప్ప` హార్డ్ డిస్క్ దొంగతనంలో మనోజ్ ప్రమేయం ఉందని విష్ణు పరస్పరం ఆరోపించుకున్నారు. అయితే, `కన్నప్ప`, `మిరాయ్` సినిమాల విడుదల సమయంలో వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు మద్దతు తెలుపుకోవడంతో వివాదం సద్దుమణిగినట్లు కనిపించింది. ఈ గొడవల వల్ల కుటుంబం పడిన ఆవేదనను లక్ష్మి మంచు ఒక ఇంటర్వ్యూలో పంచుకుంటూ, ఐక్యత కోసం ఆశాభావం వ్యక్తం చేశారు.
వేణుస్వామికి హైకోర్టు షాక్
ప్రముఖ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ పాపులర్ అయిన జ్యోతిష్యుడు వేణుస్వామికి 2025 గడ్డు కాలంగా మారింది. నాగచైతన్య - శోభిత విడాకులపై ఆయన చేసిన అంచనాలు, ఆ తర్వాత నటి ప్రగతి సాధించిన మెడల్స్ వెనుక తన పూజలు ఉన్నాయన్న వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి. హైకోర్టు జోక్యంతో మహిళా కమిషన్ ఆయనపై విచారణ చేపట్టింది. దాంతో సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై కామెంట్స్ చేయనని ఆయన లిఖితపూర్వకంగా రాసివ్వడం ఈ ఏడాది పెద్ద హైలెట్.