తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పాలనను మరింతగా ప్రజలకు చేరువ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా సుపరిపాలన స్థానంలో స్మార్ట్ పరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. తాజాగా ఆయన మంగళవారం సాయంత్రం అధికారులతో భేటీ అయిన ఆయన.. గుడ్ గవర్నెన్స్(సుపరిపాలన)పై సమీక్షించారు. ఇప్పటి వరకు పాలన బాగానే ఉందని.. అయితే.. ఇక నుంచి మారుతున్న కాలానికి, ప్రజల అభిరుచులకు అనుగుణంగా స్మార్ట్ గవర్నెన్స్ వైపు అడుగులు వేయాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆదిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు.
అదేసమయంలో హైదరాబాద్ నగర విస్తరణ, అభివృద్ధి పైనా అధికారులతో చర్చించారు. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ ఆర్) అభివృద్ధి పై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.దీనిని ఒక పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రస్తావించే పారదర్శక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని.. వాటిపై సమస్యలు రాకుండా.. న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే ఐదేళ్ల వరకు పక్కా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని అడుగులు వేయాలన్నారు. ప్రభుత్వానికి ప్రజలే ముందు...(పీపుల్ ఫస్ట్) అనేది గుర్తించాలన్నారు.
ముఖ్యంగా కోర్ సిటీ(ప్రధాన నగరం)ని 12 జోన్లుగా విభజించాలని నిర్ణయించిన విషయాన్ని మరోసారి వారితో చర్చించారు. అదేవిధంగా 60 సర్కిళ్లు, 300 వార్డులుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రక్షాళన జరగాలని తేల్చి చెప్పారు. జోన్‌లలో సమస్యలను నిరంతరం పర్యవేక్షించాలని..వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా నిత్యం సమస్యగా మారిన చెత్త సేకరణ, దాని నుంచి ఆదాయం వచ్చేలా చూడడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. నెలకు 3 రోజులు పారిశుద్ధ్య పనుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. స్మార్ట్ గవర్నెన్స్ అంటే.. ప్రజలకు మరింతగా సేవలు అందించడమేనని.. తేల్చి చెప్పారు.