ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవర్ హౌస్ గా మారిన పిఠాపురం నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతికి ఇంకా కొన్ని రోజులు సమయం ఉన్నప్పటికీ, పిఠాపురం ప్రజలకు మాత్రం ఆ పండుగ ముందే వచ్చేసింది. దానికి కారణం.. వారి ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనకు రానుండటమే. పవన్ రాకతో పిఠాపురం వీధులన్నీ పండుగ శోభను సంతరించుకున్నాయి.
శుక్రవారం నుంచి ఆదివారం వరకు పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే మకాం వేయనున్నారు. కేవలం రాజకీయ పర్యటనగానే కాకుండా, అటు అభివృద్ధి.. ఇటు పండుగ సంబరాల కలయికగా ఈ టూర్ సాగనుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే `ముందస్తు సంక్రాంతి సంబరాల` కు పవన్ స్వయంగా హాజరుకానుండటంతో నియోజకవర్గ ప్రజల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది.
మరోవైపు అభివృద్ధి పనుల విషయంలో కూడా పవన్ ఈ పర్యటనలో దూకుడు ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా గొల్లప్రోలు పరిధిలో ఇళ్లు లేని పేదల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయాలను ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడంలో జాప్యం జరగకూడదని భావిస్తున్న ఆయన, అధికారులతో కలిసి నిర్మాణ ప్రగతిని సమీక్షించనున్నారు. దీనితో పాటు రంగరాయ మెడికల్ కాలేజీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ద్వారా నియోజకవర్గ మౌలిక సదుపాయాల కల్పనపై తనకున్న చిత్తశుద్ధిని చాటుకోనున్నారు.
శాంతిభద్రతల విషయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీతో భేటీ అయి నియోజకవర్గంతో పాటు జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. అదే సమయంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త ఏడాదిలో తొలిసారిగా పవన్ పిఠాపురం వస్తుండటంతో కార్యకర్తల్లో మునుపెన్నడూ లేని విధంగా జోష్ కనిపిస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన పిఠాపురం నియోజకవర్గంలో కొత్త కాంతులు నింపుతోంది. అటు అభివృద్ధి పనుల పర్యవేక్షణ, ఇటు సంక్రాంతి సంబరాల సందడితో పిఠాపురం వీధులన్నీ జనసందోహంగా మారాయి.