గత ప్రభుత్వ హయాంలో తీవ్ర వేధింపులకు గురై, ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ సుధాకర్ ఉదంతం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఒక ప్రభుత్వ వైద్యుడిని నడిరోడ్డుపై బంధించి, హింసించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలబడతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో సుధాకర్ కుటుంబం పట్ల అత్యంత మానవీయమైన నిర్ణయం తీసుకున్నారు.
డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా, వారికి సామాజిక భద్రత కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆ కుటుంబానికి రూ. 1 కోటి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కేవలం డబ్బుతోనే సరిపెట్టకుండా, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సుధాకర్ కుమారుడు లలిత్ ప్రసాద్ కు నేరుగా పదోన్నతి కల్పిస్తూ, గ్రూప్-2 స్థాయి డిప్యూటీ తహసీల్దార్ పోస్టును మంజూరు చేశారు.
ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ``ఇది కేవలం ఒక కుటుంబానికి ఇచ్చే డబ్బు మాత్రమే కాదు.. వేధింపుల వల్ల సర్వం కోల్పోయిన ఒక నిరుపేద వైద్యుడి కుటుంబానికి ప్రభుత్వం కల్పించిన ఆర్థిక భద్రత మరియు ఆత్మగౌరవం`` అని ఆయన పేర్కొన్నారు. ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి గ్రూప్-2 అధికారిగా పదోన్నతి కల్పించడం ద్వారా ఆ కుటుంబం సమాజంలో గౌరవంగా బతకాలని ముఖ్యమంత్రి భావించినట్లు ఆయన తెలిపారు. మొత్తానికి డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీకి బాబు ఇచ్చిన ఈ బిగ్ గిఫ్ట్ పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.