రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు.. అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. `కల్కి` వంటి గ్లోబల్ హిట్ తర్వాత మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న `ది రాజా సాబ్`పై కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. హారర్ కామెడీ జోనర్‌లో ప్రభాస్‌ను సరికొత్తగా చూడబోతున్నామని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. గురువారం ప్రీమియర్లతో రాజాసాబ్ సందడి మొదలైనప్పటికీ, థియేటర్ల నుండి వస్తున్న రెస్పాన్స్ మాత్రం చిత్రబృందాన్ని కలవరపెడుతోంది. సినిమాకు వస్తున్న నెగిటివ్ టాక్ ఒకెత్తయితే, సినిమాలోని ఒక కీలకమైన ఎపిసోడ్ మాయమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమాలో ప్రభాస్ ముసలి గెటప్‌లో కనిపిస్తారని ప్రమోషన్ల నుంచే ఊరించారు. పోస్టర్లలో ఆ లుక్ అదిరిపోయింది, ట్రైలర్‌లోనూ ఆ గెటప్ చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. తీరా థియేటర్ కి వెళ్తే.. ఆ ముసలి ప్రభాస్ ఎక్కడా కనిపించలేదు. చిత్రబృందం ఎంతో ప్రతిష్టాత్మకంగా, దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేసి చిత్రీకరించిన 9 నిమిషాల నిడివి గల ఆ `ఓల్డ్ ప్రభాస్` ఎపిసోడ్ మొత్తాన్ని ఎడిటింగ్ టేబుల్ మీద కట్ చేసేశారు.
సినిమా నిడివి ఇప్పటికే 3 గంటలు దాటిపోవడంతో, ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారనే భయంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఫస్టాఫ్‌లో అనవసరమైన సన్నివేశాలు, సాగదీత సీన్లు బోలెడు ఉన్నా.. వాటన్నింటినీ వదిలేసి, ఏకంగా సినిమాకే హైలైట్ అని భావించిన 20 కోట్ల ఎపిసోడ్‌ను పక్కన పెట్టడం ఇప్పుడు ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు.
అయితే ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. ఈ సీన్లను మేకర్స్ పూర్తిగా వదిలేయలేదట. సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత, రిపీట్ ఆడియన్స్‌ను రప్పించడం కోసం ఈ 9 నిమిషాల ఎపిసోడ్‌ను మళ్ళీ సినిమాలో యాడ్ చేయాలనేది దర్శకుడు మారుతి అండ్ టీమ్ ప్లాన్. కానీ, ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. సినిమాకు ఆల్రెడీ నెగిటివ్ టాక్ వచ్చేసింది. ఈ సమయంలో కొత్తగా సీన్లు యాడ్ చేసి సినిమాను కాపాడుకోవాలి గానీ, సంక్రాంతి తర్వాత యాడ్ చేస్తే అప్పటికి థియేటర్లలో రాజాసాబ్ ఉంటాడా? అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ మేకర్స్ ఈ విషయంలో త్వరగా మేల్కొనకపోతే ఆ రూ. 20 కోట్లు నిజంగా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.